మూఢనమ్మకాలు, పిచ్చి భక్తితో కన్నబిడ్డలనే క్రూరంగా హతమార్చిన మదనపల్లె తల్లిదండ్రులను పోలీసలు మంగళవారం అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. మూడు రోజుల కిందట చిత్తూరు జిల్లాలో వీరు ఈ దారుణానికి ఒడిగట్టారు. ప్రస్తుతం వీరు మదనపల్లె సబ్ జైలులో ఉన్నారు. 

అయితే దంపతులిద్దరూ నిన్నటి నుంచి ఆహారం తీసుకోవట్లేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిందితులను పరీక్షించిన వైద్యులు వారిని తిరుపతి రుయాకు తరలించాలని సిఫారసు చేశారు. 

వైద్యుల సూచనలతో పోలీసులు దంపతులిద్దరినీ తిరుపతికి తరలించే యోచనలో ఉన్నారు. మదనపల్లె జైలు సూపరింటెండెంట్ న్యాయమూర్తిని ఈ మేరకు అనుమతి కోరారు. ఇదిలా ఉంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి నిందితులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. 

నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భార్యభర్తలను పోలీసులు వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. అక్కడ భార్య అరవడంతో భర్త పురుషోత్తం నాయుడు సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా ఆయన తన భర్తే కాదని తాను శివుడినని పక్కకు తోసేసిన విషయం తెలిసిందే. 

కలియుగం అంతమవుతుందని సత్యయుగం ప్రారంభవుతుందని దీనికోసం బలి ఇవ్వాలంటూ ఇద్దరు కూతుర్లను ఆదివారం నాడు అతి కిరాతకంగా చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచనలం రేకెత్తించిన సంగతి తెలిసిందే.