జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ కలిశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మచిలీపట్నం లేదా గుంటూరు సీటు తనకు కేటాయించాలని బాలశౌరీ కోరినట్లుగా తెలుస్తోంది. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ కలిశారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో పవన్‌తో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మచిలీపట్నం లేదా గుంటూరు సీటు తనకు కేటాయించాలని బాలశౌరీ కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి పవన్ స్పందిస్తూ ఖచ్చితంగా సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో త్వరలోనే బాలశౌరీ జనసేన తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుత బందర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో బాలశౌరికి గత కొంతకాలంగా విభేదాలున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించడంపై అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు తన కొడుకు అసెంబ్లీ టికెట్ పైనా క్లారిటీ ఇవ్వకపోవడంతో వైసీపీనీ వీడాలని బాలశౌరి నిర్ణయించుకున్నారు.