ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ ఎం.ఏ షరిఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్ పదవికి షరీఫ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ప్రకటించారు. 

ఆ తర్వాత చంద్రబాబు, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్‌లు ఆయనను అభినందించి ఛైర్మన్ స్థానంలో కూర్చొబెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఫరూఖ్‌ని మంత్రిగా, షరీఫ్‌ని మండలి ఛైర్మన్‌గా చేయటం ద్వారా మైనార్టీలకు రెండు ముఖ్యమైన పదవులు ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామన్నారు.

రాష్ట్రంలో 78.5 శాతం ప్రజలు టీడీపీ ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. షరీఫ్ నేతృత్వంలో సభ సజావుగా సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాసనమండలి గౌరవం నిలబెడతానని, ప్రజలకు సేవ చేస్తానని ఛైర్మన్ షరీఫ్ చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన షరీఫ్ 1955 జనవరి 1న జన్మించారు. భోపాల్‌లో న్యాయవాద పట్టాని పొందిన ఆయన స్టూడెంట్ లీడర్‌గా చురుకైన పాత్రను పోషించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ పిలుపుతో ఆయన టీడీపీలో చేరారు.

మూడున్నర దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఆయన పార్టీలో వివిధ పదవులు పొందారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. షరీఫ్ సేవలకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దానితో పాటు మండలిలో ప్రభుత్వ విప్‌గాను నియమించారు.