అమరావతి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారంనాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సీనియర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. వెంటనే తన పిటిషన్ మీద విచారణ జరపాలని ఆయన హైకోర్టును కోరారు. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలక అంశాలను ఆయన పిటిషన్ లో ప్రస్తావించారు. ఈ పిటీషన్ మీద విచారణలో జాప్యం జరిగితే కీలక సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. 

సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను కూడా శ్రావణ్ కుమార్ న్యాయమూర్తి ఎదుట ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ ను తీవ్రమైన నేరంగా పరిగణించాలని ఆయన కోరారు. వాదనలు విన్న తర్వాత దానిపై మంగళవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కు ప్రభుత్వం ఓ వ్యక్తిని నియమించినట్లు ఆయన ఆరోపించారు. 

తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఆరోపిస్తున్నారు.  తన ఫోన్ ట్యాపింగ్ లో ఉందని ఆయన ఓ ప్రముఖ మీడియా సంస్థతో చెప్పారు. ఆ వ్యవహారంపై తాను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.