విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు మండలం యలమందలో నరబలి ఇవ్వడానికి ప్రయత్నించిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. వందేళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన సుదీర్ఘ చంద్రగ్రహణం రోజున నరబలి ఇస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయనే నమ్మకంతో ఏడుగురు వ్యక్తులు నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారు. 

అందుకు వారు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. నరబలి ఇచ్చిన తర్వాత మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యిని కూడా తవ్వించారు. చిన్నం ప్రవీణ్‌ (32) అనే వ్యక్తిని బలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. క్షుద్రపూజలపైవిచారణ జరుపుతున్నారు. హైదరాబాదులోని ఉప్పల్ లో ఓ చిన్నారిని బలి ఇచ్చిన ఘటనను మరిచిపోక ముందే అటువంటి ఘటన వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపుతోంది.