Vijayawada: హిందూ మహాసముద్రంలో అల్పపీడనం కార‌ణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్ల‌డించింది. హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. 

 Indian Meteorological Department (IMD): హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్య దిశగా కదులుతుంది. గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్ల‌డించింది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కోమోరిన్ ప్రాంతం వైపు కదిలే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం తెలిపింది. అయితే దీని ప్రభావం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై నామమాత్రంగానే ఉంటుందని తెలిపింది.

మరోవైపు ఈశాన్య, ఆగ్నేయ గాలులు రాష్ట్రంలో వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పొగమంచు కొనసాగడంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 24వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. 

ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం, ఈ వ్యవస్థ ట్రింకోమలీ (శ్రీలంక) కు తూర్పు-ఈశాన్యంగా 420 కిలోమీటర్లు, నాగపట్టణం (తమిళనాడు) కు ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, చెన్నై (తమిళనాడు) కు ఆగ్నేయంగా 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉంది. ఈ వ్యవస్థ రాబోయే 24 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూనే ఉంటుందనీ, తరువాత 48 గంటల్లో క్రమంగా పశ్చిమ-నైరుతి దిశగా శ్రీలంక మీదుగా కోమోరిన్ ప్రాంతం వైపు తిరిగి వస్తుందని ఐఎండి తెలిపింది. 

దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తా తమిళనాడులో డిసెంబర్ 25, 26 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా, 2022 డిసెంబర్ 26 న దక్షిణ కేరళలో కొన్ని ప్రదేశాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, వివిక్త ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 22 నుంచి 25 వరకు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచించింది.

ప్ర‌స్తుత వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు ప‌లు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా మహారాష్ట్రలో కూడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. ఈశాన్య భారతదేశంలోని బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కొంత మోస్తరు పొగమంచు ఉండే అవకాశం ఉంది.

Scroll to load tweet…