రెండు రోజుల్లో పెళ్లి అనగా.. ఓ యువతి తన ప్రేమికుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో  చోటుచేసుకుంది. తమ ప్రేమకు దక్కదనే బాధతోనే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బొబ్బిలి పట్ణం జగన్నాథపురానికి చెందిన చంద్రశేఖర్(21), కృష్ణవేణి(19) కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కృష్ణవేణికి ఇటీవల వివాహం కుదిరింది. బుధవారం ఆమెకు వివాహం జరగాల్సి ఉంది. కాగా.. ఆదివారం కాబోయే భర్తతో కలిసి బైక్ మీద షాపింగ్ కి అని చెప్పి వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక.. వరుడు కళ్లుగప్పి తప్పించుకొని ప్రియుడిని చేరుకుంది.

దొరికితే... వేరే వ్యక్తితో పెళ్లి చేసేస్తారనే భయంతో.. ప్రియుడితో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు కృష్ణవేణి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. సోమవారం ఉదయం ప్రియుడు చంద్రశేఖర్ తో కలిసి రైలు కింద శవమై కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చంద్రశేఖర్ ఇటీవల డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. క్షణికావేశంతో ఇద్దరూ ప్రాణాలను కోల్పోయి.. వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చారని అంతా భావిస్తున్నారు.