ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుంది. గుడిలో పెళ్లి చేసుకుని పెద్దల భయంతో బయట అడుగు పెట్టలేదు. తలుపులు మూసేసి లోపలే ఉండటం పోలీసులకు తెలిసింది. వారిని ఊరి పెద్దల సాయంతో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారిద్దరి కుటుంబాలు పోలీసు స్టేషన్‌కు రావడానికి నిరాకరించాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట.. పెద్దల భయంతో గుడిలోని ఓ గదిలో తాళం వేసుకుని ఉండిపోయారు. పెద్దల ఇష్టాలకు వ్యతిరేకంగా తాము పెళ్లి చేసుకున్నామని, కాబట్టి, వారు తమపై దాడి చేయవచ్చనే భయంతో బయట అడుగు పెట్టలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇందులో జోక్యం చేసుకున్నారు. ఈ ఘటన బందరు మండలం బుద్దలపాలేం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.. బుద్దలపాలేం గ్రామానికి చెందిన కొక్కు నాగరాజు అదే గ్రామంలో వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. మచిలీపట్నంకు చెందిన గాయత్రి సుమారు రెండేళ్ల క్రితం సెక్రెటేరియట్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. ఆమె పోస్టింగ్ బుద్దలపాలేం సెట్రెటేరియట్‌లో పడటంతో అక్కడకు వెళ్లింది. వీరిద్దరూ తమ వృత్తిలో భాగంగా తరుచూ కలుసుకునేవారు. అది పరిచయంగా మారింది. అనంతరం, ప్రేమకు దారి తీసింది. అయితే, వారి కులాలు వేరు. అందుకే ప్రేమించుకున్నా పెళ్లి అంటే భయపడ్డారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని భావించి అదే గ్రామంలోని రామాలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.

Also Read: వినుకొండలో గ్యాంగ్ వార్... బీరు సీసాలతో టిడిపి, వైసిపి శ్రేణుల వీరంగం

సోమవారం వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారు ఆలయంలోనే ఉన్నారు. వారి కుటుంబ పెద్దల నుంచి ప్రమాదం ఉంటుందని భయపడి డోర్లు క్లోజ్ చేసి లోపలే ఉన్నారు. అయితే, ఈ విషయం రూరల్ సీఐ రవి కుమార్, ఎస్ఐ చాణక్యలకు తెలిసింది. 

ఊరి పెద్దల సహాయంతో వీరు.. పెళ్లి చేసుకున్న జంటను పోలీసు స్టేషన్‌ కు తీసుకువెళ్లారు. ఆ జంట ఇరు కుటుంబాలకు ఫోన్లు చేశారు. పోలీసు స్టేషన్‌కు రావాల్సిందిగా అడిగారు. కానీ, ఆ ఉభయ కుటుంబాలూ పోలీసు స్టేషన్‌కు రావడానికి నిరాకరించాయి. దీంతో పోలీసులే ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చి.. గ్రామ పెద్దల సమక్షం లో అక్కడి నుంచి పంపించారు.