అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రయుడ్ని వదులుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెతో పాటు పురుగుల మందు తాగిన ప్రయుడు ఆస్పత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

ఆ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సీసీ కొత్తకోట బస్సు స్టాప్ వద్ద జరిగింది. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామానికి చెందిన అంజలి, బుక్కరాయ సముద్రం గ్రామానికి చెందిన యోగానంద్ సీసీకొత్తకోట బస్టాప్ వద్ద పురుగుల మందు తాగారు. 

స్థానికులు గమనించి వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంజలి ఆదివారం మరణించింది. అంజలికి పదేళ్ల క్రితం మహేంద్ర అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. అంజలి తన సమీప బంధువైన యోగానంద్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 

ఆ విషయంపై బంధువులు ఆమెపై విరుచుకుపడ్డారు. దాంతో ఇంటి నుంచి బయటకు వచ్చి యోగానంద్ తో కలిసి పురుగుల మందు తాగింది. యోగానంద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.