Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మపదార్ధంలా తయారైన జీఎస్టీ

ఆర్ధికవేత్తల ప్రకారం ఇటు రాష్ట్రాలైనా అటు కేంద్రమైనా తమకు వస్తున్న ఆదాయాన్ని కోల్పోవటానికి సిద్ధంగా లేవు. కేంద్ర, రాష్ట్రాల్లో ఏవి కూడా ఆదాయాలను కోల్పోకుండానే జనాలను ఎలా ఉద్దరిస్తాయ్? ఏ రంగాల్లో ధరలు తగ్గుతాయనే విషయంలో కేంద్రం చెబుతున్న మాటకు నిపుణులు, ఆర్ధికవేత్తలు చెబుతున్న మాటలకు పొంతనే ఉండటం లేదు. కేంద్రప్రభుత్వంలోని ఉన్నతాధికారులు చెప్పే మాటల ప్రకారమే మరో రెండేళ్ళ పాటు ఏ వస్తువుల ధరలు తగ్గవు. పెరిగిన ధరలతో జనాలు బహుశా అలవాటు పడిపోతారేమో డిమానిటైజేషన్ సమస్యలకు అలవాటు పడిపోయినట్లు.

Lot of confusion over gst implementation among nation

కేంద్రప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం దేశంలోని సామాన్యుల నుండి మేధావుల వరకూ అందరినీ అయోమయంలో పడేస్తోంది. ఈనెల 30వ తేదీ నుండి అమలులోకి రానున్న జీఎస్టీ చట్టమే అయోమయానికి కారణం. ఎన్డీఏలోని భారతీయ జనతా పార్టీతో పాటు భాగస్వామ్య పార్టీల వరకూ జీఎస్టీకి స్వాగతం పలికాయి. గట్టిగా చెప్పాలంటే కాంగ్రెస్ సారధ్యంలోని యూపిఏ కూడా జిఎస్టీని ఆమోదించిందనుకోండి అదివేరే సంగతి.

కేంద్రప్రభుత్వం చెబుతున్న ప్రకారం జిఎస్టీ అమలైతే చాలా వస్తువుల ధరలు తగ్గుతాయి. వినియోగదారుల జేబులు డబ్బుతో బరువెక్కుతాయి. వినియోగదారులు బరువెక్కిన జేబుతో మళ్లీ షాపింగులు గట్రా చేస్తారు. కాబట్టి మార్కెట్లో నిరంతరం డబ్బులు చెలామణి అవుతూనే ఉంటుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే చాలా వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతాయి. సామాన్య, మధ్య తరగతి వర్గాల జేబులకు చిల్లు పడటం ఖాయమని ఆర్దిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ధికవేత్తల ప్రకారం ఇటు రాష్ట్రాలైనా అటు కేంద్రమైనా తమకు వస్తున్న ఆదాయాన్ని కోల్పోవటానికి సిద్ధంగా లేవు. కేంద్ర, రాష్ట్రాల్లో ఏవి కూడా ఆదాయాలను కోల్పోకుండానే జనాలను ఎలా ఉద్దరిస్తాయ్? ఏ రంగాల్లో ధరలు తగ్గుతాయనే విషయంలో కేంద్రం చెబుతున్న మాటకు నిపుణులు, ఆర్ధికవేత్తలు చెబుతున్న మాటలకు పొంతనే ఉండటం లేదు. కేంద్రప్రభుత్వంలోని ఉన్నతాధికారులు చెప్పే మాటల ప్రకారమే మరో రెండేళ్ళ పాటు ఏ వస్తువుల ధరలు తగ్గవు. పెరిగిన ధరలతో జనాలు బహుశా అలవాటు పడిపోతారేమో డిమానిటైజేషన్ సమస్యలకు అలవాటు పడిపోయినట్లు.

ఇక, రాజకీయంగా చూస్తే మొన్నటి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో భాజపా మంచి ఊపుమీదుంది. ప్రపంచబ్యాంకు నుండి తీసుకున్న రుణాల కారణంగా ప్రపంచబ్యాంకు ఒత్తిడి వల్లే కేంద్రం జీఎస్టీ అమలులోకి తెస్తోందని ఆర్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జిఎస్టీ అమలులో ఉన్న 150 దేశాల్లో ఎక్కడ కూడా నిత్యావసరాల ధరలు తగ్గలేదని నిపుణులు అంటున్నారు.

పెట్రోలు, డీజల్, లిక్కర్, రియల్ ఎస్టేట్ రంగాలను మాత్రం జీఎస్టీ నుండి కేంద్రం మినహాయించింది. ఎందుకంటే, కేంద్ర, రాష్ట్రాల ఆదాయాల్లో సుమారు 40 శాతం పై రంగాల నుండే వస్తోంది. వాటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తే దేశ ఆర్ధిక వ్యవస్ద కుప్పకూలిపోవటం ఖాయమని నిపుణులంటున్నారు. పెట్రోలు, డీజల్ ను గనుక జీఎస్టీ పరిధిలోకి తెస్తే అప్పుడు సామాన్య, మధ్య తరగతి జనాలకు ఊరట కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం జీఎస్టీ అమలుతో ఫ్యామిలీ బడ్జెట్ పై భారం తప్పదు. జీఎస్టీ నినాదమే ఒకే దేశం-ఒకే పన్ను. జీఎస్టీ వల్ల ఏ వస్తువుపై ఎంతెంత భారం పడుతుందన్న విషయం స్ధూలంగా ఇలా ఉంటుంది.

జీవితబీమాకు ఏడాది ప్రీమియం రూ.15 వేలు అనుకుందాం. ప్రస్తుతం మీరు రూ.2250 పన్ను చెల్లిస్తున్నారు. జీఎస్టీ పుణ్యమా అని రూ.2,700 చెల్లించాలి. అలాగే, రూ.60వేల విలువైన ఆభవరణాలు కొనుగోలు చేస్తే ప్రస్తుతం రూ.1,800 ట్యాక్స్ చెల్లిస్తున్నారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చిన తర్వాత రూ.2వేలు కట్టాల్సి ఉంటుంది. ఇక, మధ్య తరగతి జనాలు ఎప్పుడైనా హోటల్ కు వెళ్ళి సరదాగా భోజనం చేద్దామని అనుకుంటారు. నలుగురు సభ్యుల కుంటుంబం రెస్టారెంట్ కు వెళ్ళినపుడు రూ. 2 వేలు అయ్యే  బిల్లు జీఎస్టీ తరువాత సుమారు రూ. 3 వేలౌతుంది. 

రూ.200 విలువైన వంటనూనె కొనుగోలు చేస్తున్నట్లయితే ప్రస్తుతం రూ,.23 ట్యాక్స్ చెల్లిస్తున్నారు. జీఎస్టీ అమలైతే పడే భారం 10 రూపాయలు మాత్రమే పన్ను పడుతుంది. ఓ ఇంట్లో రెండు ఫోన్లు, ఓ డీటీహెచ్ సర్వీస్ ఉన్నాయనుకుందాం.  ప్రస్తుతం కనీసంగా అయ్యే బిల్లు రూ.2,500. అందులోనే రూ.375 పన్నుంది. జీఎస్టీ అమల్లోకి వస్తే రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రూ.2వేల రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేస్తే ప్రస్తుతం చెల్లిస్తున్నది రూ.130 ట్యాక్స్. జీఎస్టీ పరిధిలోకి రావటం వల్ల రూ.240 పన్ను కట్టాల్సుంటుంది.

అదేవిధంగా, నలుగురు మల్టీఫ్లెక్స్ లో సినిమాకు వెళితే రూ.1200 ఖర్చు అవుతుంది. అందులో చెల్లిస్తున్న ట్యాక్స్ రూ.360. జీఎస్టీ పరిధిలోకి వచ్చిన తర్వాత రూ.336 అదనంగా కట్టాల్సి ఉంటుంది.  రైల్లో మూడు వేల రూపాయల విలువైన టికెట్లు మీరు కొనుగోలు చేస్తే ప్రస్తుతం కడుతున్న పన్ను రూ.131 మాత్రమే. ఇక నుంచి రూ.150 కట్టాలి. మొత్తంగా ఓ మధ్య తరగతి కుటుంబంపై జీఎస్టీ భారంగానే ఉండబోతోందన్నది అర్ధమైపోతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios