టీటీడీ శ్రీవారి భక్తులకు షాకిచ్చింది. ఆగస్టు నెలలో తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది.
టీటీడీ శ్రీవారి భక్తులకు షాకిచ్చింది. ఆగస్టు నెలలో తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమంపై చర్చించేందుకు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకు ఆగస్టు 9 నుంచి 17 వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు..
ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు. ఈ సమయంలో వైదిక క్రతువులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం.. భక్తులకు దర్శనం కల్పించేందుకు సమయం తక్కువ ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ.. ఈ నేపథ్యంలో ఆగస్టు 9 వ తేదీ ఉదయం నుంచి ఆగస్టు 17 సాయంత్రం వరకు తిరుమల కొండపై భక్తుల రాకను నిలిపివేయనున్నారు.
తిరుమలలో చివరి సారిగా 2006లో మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్లో రోజుకి 20 నుంచి 30 వేల మంది భక్తులు మాత్రమే వచ్చే వారు కాబట్టి దర్శనానికి పరిమితంగా భక్తులను అనుమతించేవారు. అయితే ప్రస్తుతం రోజుకి తిరుమల వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో దర్శనాన్ని పూర్తిగా నిలిపివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది..
