అదో ఏడుగురు సభ్యుల ముఠా. సంపన్నుల ఇళ్ళకు చెందిన అమ్మాయిలే వాళ్ళ లక్ష్యం. అటువంటి వాళ్ళని ఆకర్షించటానికి ముఠా పెద్ద ప్లానే వేసింది. చాలా మందిని మంచి చేసుకుని ముఠా ముంచింది. అయితే ఓ బాధితురాలిచ్చిన ఫిర్యాదుతో మొత్తం డొంకంతా కదిలి చివరకు ఏలూరుకు చెందిన ఈ ముఠా మొత్తం జైలు పాలైంది.

ఇంతకీ ఆ ముఠా ఏం చేసిందంటే, ఫేస్ బుక్ లో, వాట్సప్ లో ఎకౌంట్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఎకౌంట్ల ద్వారా అందమైన అమ్మాయిలను ఎంపిక చేసుకుంటారు. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకుని అందులో కూడా బాగా డబ్బున్న వాళ్ళ కూతుళ్ళనే టార్గెట్ చేసుకుంటారు. మెల్లిగా వాళ్ళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. తమ ఎకౌంట్లలో ప్రముఖులతో దిగినట్లు ఫోటోలు, ఖరీదైన హోటళ్ళలోను, విమానాల్లోను తిరుగుతున్నట్లుగా ఫొటోలు పోస్టు చేస్తారు.

అటువంటి ఫొటోలు చూసిన అమ్మాయిల్లో ఎవరైనా ఆకర్షితులైతే వాళ్ళ గురించి తమకు ఉపయోగపడతారని అనుకుంటే ప్రొసీడవుతారు. అప్పటికే ఎంపిక చేసిన అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళలో ఎవరైనా ఓకే చేస్తే వాళ్ళతో చాటింగ్ మొదలుపెడతారు. మెల్లిగా సన్నిహితాన్ని పెంచుకుంటారు. అవకాశం ఉన్నపుడల్లా నేరుగా కలుస్తారు. అందుకోసం ఈ ముఠా బాగా డబ్బు కూడా ఖర్చుపెడుతుంది.

బాగా ఫ్రెండిషిప్ పెరిగిందనుకున్న తర్వాత ప్రేమ పేరుతో వాళ్ళతో సన్నిహితంగా ఉన్నపుడు ఫొటోలు తీసుకుంటుంది. తర్వాత అవే ఫొటోలను వాళ్లకు చూపించి బ్లాక్ మైల్ మొదలుపెడతారు. అలా ఒక్కోళ్ళ నుండి వీలైనంత డబ్బు గుంజుతారు. మొత్తం ముఠాలోని సభ్యులంతా 24 గంటలూ ఇదే పని మీదుంటారు. ఈ విధంగా ఎంతోమంది మహిళలు వీరి చేతిలో నష్టపోయారు. అయితే, ఓ బాధితురాలిచ్చిన ఫిర్యాదుతో వాళ్ళ బండారం బయటపడింది.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ముఠాను వలేసి పట్టుకున్నపుడు వారి వద్ద రూ. 1.25 కోట్ల డబ్బు, 1.5 కిలోల బంగారు నగలు రికవరీ చేశారు. అలాగే ఓ చవర్లెట్ కారు, కెటిఎం డ్యూక్ బైక్, కవాసాకి బైక్, అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారో పోలీసులు. అంటే ఏ స్ధాయిలో ముఠా పకడ్బందీగా డబ్బు వసూళ్ళు చేసిందో అర్దమవుతోంది. ఏలూరు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.