ఆంధ్ర సారస్వత పరిషత్ (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో వచ్చేఏడాది జనవరిలో జరగనున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలకు సంబంధించి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓ సందేశాన్ని పంపించినట్లు పరిషత్ అద్యక్షులు గజల్ శ్రీనివాస్ తెలిపారు.
భీమవరం: ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్ర సారస్వత పరిషత్ (andhra saraswatha parishath) (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ తెలుగు సంబరాలు' (international telugu celebrations) ఘనంగా జరపనున్నట్లు పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ (gajal srinivas) తెలిపారు. 2022 జనవరి 6, 7, 8 తేదీల్లో కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలోని వెస్ట్‌బెర్రీ హైస్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో ఈ సంబరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ అంతర్జాతీయ తెలుగు సంబరాలను ఉద్దేశించి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఓ సందేశాన్ని పంపినట్లు శ్రీనివాస్ తెలిపారు. తెలుగు సాహితీ ప్రముఖుల వ్యాసాలతో రూపుదిద్దిన ప్రత్యేక సంచికను 'అంధ్ర వాఙ్మయ వైజయంతి' పేరుతో విడుదల చేయడం ఎంతో సంతోషకరమని ఓంబిర్లా పేర్కొన్నారని గజల్ శ్రీనివాస్ తెలిపారు.
''మన భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ప్రాచీన సాంప్రదాయాలు, అనేక భాషలు కలిగి ఐకమత్యంతో విలసిల్లే దేశం. ప్రాచీన కాలం నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే మధురమైన భాష తెలుగు. అలాంటి తెలుగులో గొప్ప చారిత్రాత్మక, సాహితీ విలువలు కలిగిన ఎన్నో సృజనాత్మక సాహిత్యాన్ని లక్షలాదిమంది కవులు రచించారు. ఈ అంతర్జాతీయ తెలుగు సంబరాలు కవుల భావ వ్యక్తీకరణకు, సృజనాత్మకకు వేదిక అయి ప్రాచీన తెలుగుభాషా వికాసానికి, పరిపుష్టికి కృషి చేస్తుందని నాకు అపారమైన విశ్వాసం. తెలుగు సంబరాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను'' అంటూ ఓం బిర్లా సందేశం పంపినట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు.
