మంత్రైనా లోకేష్ కు అనుకున్నంత మైలేజ్ రాలేదు. పైగా వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటోంది. దాంతో సొంతంగా జిల్లాలకు పంపితే కానీ అనుకున్నంత ప్రచారం సాధ్యం కాదని చంద్రబాబే పుత్రరత్నం పర్యటనలను ఫిక్స్ చేసారని సమాచారం.

మొత్తానికి చంద్రబాబునాయుడు పుత్రరత్నం నారా లోకేష్ ను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. తన నీడలో పుత్రరత్నం ఎదగటం కష్టమని అనుకున్నారో లేక పార్టీ, ప్రభుత్వ యంత్రాగాలు పూర్తిగా మద్దతు పలకరని అనుమానం వచ్చిందో ఏమోగానీ లోకేష్ ను ఇక్కడే వదిలేసి పది రోజులు అమెరికాకు వెళ్లారు. ఫలితం రెండు యంత్రాగాల్లోనూ బాగానే కనబడుతోంది. విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లిన లోకేష్ కనుసన్నల్లో పడేందుకు ఇటు పార్టీ అటు ప్రభుత్వ పెద్దలు పోటీ పడటం స్పష్టంగా కనబడింది.

సిఎం కొడుకంటేనే ఆయన దృష్టిలో పడేందుకు అందరూ సహజంగానే పోటీ పడతారు. అటువంటిది మంత్రి కమ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శే కాకుండా భావి ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న లోకేష్ రాచమర్యాదలకు లోటేముంటుంది? అయినా చంద్రబాబుకు అనుమానం వచ్చిందంటే ఆలోచించాల్సిందే. అందుకు తగ్గట్లే ఎవరితో ఎలా మెలగాలో లోకేష్ కు తర్ఫీదు ఇప్పించే ఉంటారు చంద్రబాబు. ఎంత శిక్షణ ఇప్పించినా మర్రిచెట్టు మర్రిచెట్టే కదా? దానికితోడు మంత్రైనా లోకేష్ కు అనుకున్నంత మైలేజ్ రాలేదు. పైగా వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటోంది. దాంతో సొంతంగా జిల్లాలకు పంపితే కానీ అనుకున్నంత ప్రచారం సాధ్యం కాదని చంద్రబాబే పుత్రరత్నం పర్యటనలను ఫిక్స్ చేసారని సమాచారం.

దానికితోడు ఐటి, పంచాయితీ రాజ్ వంటి కీలక శాఖలను చేతిలో ఉంచుకున్న లోకేష్ కూడా మంత్రైన దగ్గర నుండి సమీక్షలంటూ హడావుడి చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇపుడు జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. దానికితోడు విజయవాడ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ, పార్టీ భవనాలను ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇంకేముంది జిల్లాలోని నేతలు, అధికారులు పోలోమంటూ పొటీలు పడుతున్నారు.

తాను లేనపుడు ఇతర శాఖలను పర్యవేక్షించే బాధ్యతలు కూడా అప్పజెప్పారో లేదో స్పష్టంగా తెలీదు. ఒకవేళ లోకేష్ సమీక్షలు జరపదలుచుకుంటే అడ్డేమీ ఉండదు కదా? ఏదో యనమల, కెఇ లాంటి ఒకరిద్దరి మంత్రిత్వ శాఖలను వదిలేసినా మిగిలిన వారందరూ జూ హుజూరనే వాళ్లే కాబట్టి ఎటువంటి ఇబ్బందీ లేదు. చంద్రబాబు అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పటికి లోకేష్ కూడా ఏమాత్రం దూకుడు కనబరుస్తాడో చూద్దాం?