మెల్లి మెల్లిగా ఇతర శాఖలు, కీలక వ్యవహారాలను కూడా లోకేష్ కు అప్పగించి ప్రాధాన్యతను పెంచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన భూ కేటాయింపుల కమిటిలో చోటు కల్పించటమే ఇందుకు నిదర్శనం

చినబాబు నారా లోకేష్ కు చంద్రబాబునాయుడు పెద్ద బాధ్యతలు పెట్టేస్తున్నారు. మెల్లి మెల్లిగా ఇతర శాఖలు, కీలక వ్యవహారాలను కూడా లోకేష్ కు అప్పగించి ప్రాధాన్యతను పెంచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన భూ కేటాయింపుల కమిటిలో చోటు కల్పించటమే ఇందుకు నిదర్శనం. గతంలో ఎటువంటి పాత్ర లేకుండానే కమిటి సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. అప్పట్లో ఈ విషయమై అనేక ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏకంగా కమిటీలోనే మార్పులు చేర్పులు చేసి లోకేష్ కు స్ధానం కల్పించేసారు.

తాజా కమిటిలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు కూడా ఉన్నారు. అయితే, రెవిన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తికి మాత్రం చోటు కల్పించ లేదు. అసలు భూ కేటాయింపులంటేనే రెవిన్యూ మంత్రిదే కీలక పాత్ర. కానీ చంద్రబాబు జమానా కదా అసలు సంబంధిత శాఖ మంత్రినే కమిటిలో లేకుండా చేసారు.

అంతేకాదు. మొన్నటి వరకూ పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉండేవారు. చింతకాయల ఉన్నపుడు ఆయన్ను కమిటీలో వేయలేదు. కానీ అదే శాఖను లోకేష్ కు అప్పగించినపుడు మాత్రం సదరు శాఖా మంత్రిని కమిటిలో వేయటం విచిత్రం. అంటే సీనియర్లైన కెఇ గానీ చింతకాయలను కాదని లోకేష్ కు పట్టం కట్టారు.