తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎంఎల్‌సి సీటు కోసం నారా లోకేశ్ నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారా...
లోకేశ్ ఎమ్మెల్సీ అవుతాడట. అది కూడా తూర్పు గోదావరి జిల్లా నుంచి.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంఎల్సిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్త జిల్లా తెలుగు దేశం వర్గాల్లో గుప్పుమంది.
ఇపుడు జిల్లాలో ఒకటే చర్చ. ఎవరూ అధికారికంగా ఏమీ చెప్పలేకపోతున్నా, తూర్పు సెంటిమెంట్ తో చిన్నబాబు అసెంబ్లో కాంపౌండ్ లో కాలు పెట్టడం మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కొందరు సూచించారని, ఆయన దీనిని పరిశీలిస్తున్నారని పచ్చ సైనికులు చెబుతున్నారు.
ఆ పని మీద లోకేశ్ నేడో రేపో జిల్లాకు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
స్థానిక సంస్థల నియోజకవర్గ ఎంఎల్సి పదవికి ఈ నెల 28న నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేస్తారని టిడిపి సీనియర్ నాయకుడొకరు ఎషియానెట్ కు చెప్పారు.
ఇక్కడి నుంచి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ బొడ్డు బాస్కర రామారావు పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి మార్చి 17న ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్కూడా విడుదల చేసింది. నామినేషన్లు పర్వం మొదలవుతుంది.
బొడ్డు బాస్కర రామారావు తిరిగి తనకే అవకాశం ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరుతున్నారు. అలాగే మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టిడిపి సీనియర్ నాయకులు గన్ని కృష్ణ తదితరులు కూడా సీటు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన బాబు పేరుప్రచారంలోకి వచ్చింది. భాస్కర రావు అంటే గిట్టని వారు ఇలా లోకేశ్ పేరు ప్రచారం లోకి తీసుకువస్తున్నారని విమర్శకూడా ఉంది. అది వేరే విషయం.
అయితే,లోకేశ్ మంత్రి కాబోతున్నందున, ఆయనకు ఒకసీటయితే అసెంబ్లీలోనో కౌన్సిల్ లోనో కావాలిగా. అసెంబ్లీ కొంత రిస్కీ వ్యవహారం. అందువల్ల సులభంగా గోటితో పోయే దానికి గొడ్డలెందుకని పార్టీ అధ్యక్షుడు భావిస్తున్నట్లు ఒక వర్గం చెబుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికంటే భయపడే ఇలా కౌన్సిల్ దారి పడ్తున్నారని , ఎవరన్నా, పట్టించుకోనవసరం లేదని కూడా ఆయన తూ.గో.నా లు చెబుతన్నారట.
జిల్లా పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే ‘తూర్పు నుంచి లోకేశ్’ క్యాంపెయిన్ చేస్తున్నారని కూడా ఒకాయన వెల్లడించారు.
ఆ నాయకుడు చెబుతున్నసమాచారం ప్రకారం ఎంఎల్సి కోసం ప్రయత్నం చేస్తున్న వారందరిని జిల్లా కు చెందిన మంత్రులు రాజధానికి రప్పించి బుజ్జగించారు.
కాబోయే ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లానుంచి ఎంఎల్ సి కావడం జిల్లా అదృష్టమని, దీనికి అడ్డు చెప్పకుండా,అలాంటి ప్రతిపాదన వస్తే సై అనమని ఈ మంత్రులు వారికి చెప్పడమే కాకుండా, దీనికి ప్రతిఫలం తప్పక ఉంటుందని హామీ కూడా ఇచ్చారట.
జిల్లా నుంచి ఎంఎల్సి అయితే జిల్లా భవిష్యత్ బాగుంటుందని, నాయకులకు మంచి కాలం వచ్చినట్లేనని చెబుతున్నట్లు తెలిసింది.
