చంద్రబాబు అరెస్ట్‌ను పార్లమెంట్‌లో లేవనెత్తండి .. టీడీపీ ఎంపీలకు లోకేష్ దిశానిర్దేశం
ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు నారా లోకేష్. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు . ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబుు అరెస్ట్ చేశారన్న వాదనను పార్లమెంట్‌లో బలంగా వినిపించాలని ఆయన ఎంపీలకు సూచించారు.

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ ఎంపీలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ లోక్‌సభ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై లోకేష్ వారికి దిశానిర్దేశం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబుు అరెస్ట్ చేశారన్న వాదనను పార్లమెంట్‌లో బలంగా వినిపించాలని ఆయన ఎంపీలకు సూచించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్ధితులను ఉభయసభల దృష్టికి తీసుకెళ్లాలని లోకేష్ కోరారు.
అంతకుముందు నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ వ్యతిరేక పార్టీలు టీడీపీ, జనసేన కూటమితో కలిసి రావాలని కోరారు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్‌పై వున్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ నత్తనడకన సాగుతోందని లోకేష్ దుయ్యబట్టారు.