తనపై సాక్షి మీడియా విష ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ మండిపడ్డారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న లోకేష్... టీడీపీ నేతలు, కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాక్షిలో వార్తలు ప్రసారమయ్యాయి. దీనిపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘టీడీపీ నేతలు, కార్యకర్తలపై నేను అనుచిత వ్యాఖ్యలు చేశానని వారు చేస్తున్న విషప్రచారానికి ఆధారాలు చూపించాలని ఛాలెంజ్ చేస్తున్నాను. ఇకనైనా తమ వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.’’ అంటూ లోకేష్ మండిపడ్డారు.

‘‘ఈరోజు మంగ‌ళ‌గిరి టీడీపీ కార్యాల‌యంలోను, గుంటూరు పార్టీ కార్యాలయంలోనూ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. నేను, చంద్రబాబుగారు విడివిడిగా ఆ వేడుకల్లో పాల్గొన్నాం. @ncbn గారు పాల్గొన్న గుంటూరు పార్టీ కార్యాలయంలో ఓ మహిళా కార్యకర్త భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఇది.’’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఆమె మాట్లాడిన మాటలను తనకు ఆపాదించి విష ప్రచారం చేశారని లోకేష్ మండిపడ్డారు. 

‘‘సాక్షి చేసిన ఈ విషప్రచారాన్ని మిగిలిన మీడియా సంస్థలు కూడా అనుసరించడం విచారకరం. ఈ అస‌త్య వార్త‌ల ప్ర‌సారాన్ని ఖండిస్తూ ఈ విషయంలో వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాల్సిందిగా దీనంతటికీ కారణమైన సాక్షి మీడియా గ్రూప్, ఎడిటోరియల్ డైరెక్టర్ ను కోరుతూ లేఖ రాసాను’’ అంటూ లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

తాను ఎప్పుడూ ఎలాంటి సమయంలోనైనా కార్యకర్తలకు అండగా ఉంటానని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.