2019 నాటికి లోకేష్ కు తూర్పు గోదావరిలో ఓ మంచి నియోజకవర్గాన్ని సెట్ చేయాలని కూడా చంద్రబాబు అనుకుంటున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

యనమల రామకృష్ణుని సుదీర్ఘ రాజకీయ జీవితానికి త్వరలో చెక్ పడుతోందా? టిడిపి ఆవిర్భావం నుండి పార్టీలో యనమల హవాకు ఎదురులేదు. పార్టీకి పెద్ద దిక్కుమారారే గానీ తూర్పుగోదావరికి మాత్రం యనమలే 30 ఏళ్ళుగా పెద్దదిక్కు. అటువంటి యనమలకు చెక్ పెట్టేందుకు పార్టీలో పావులు కదులుతున్నట్లు ప్రచారం మొదలైంది. అదికూడా లోకేష్ రూపంలోనట.

లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటం ఖాయమైంది. అయితే, మంత్రైన తర్వాత అసెంబ్లీ నుండో లేక కౌన్సిల్ నుండో సభ్యునిగా లోకేష్ నెగ్గాలి. అసెంబ్లీకి పంపటానికి అవకాశం లేదు. ఎవరి చేతనైనా రాజీనామా చేయించి పోటీలో దింపాలి. అయితే, ఒక్క లోకేష్ కోసమే ఉప ఎన్నిక నిర్వహించటమంటే ఇబ్బందే. ఎందుకంటే, వైసీపీ నుండి ఫిరాయించిన 21 మంది ఎంఎల్ఏలను కూడా రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిపక్షం ఆందోళన మొదలుపెడుతుంది. అప్పుడు వ్యవహారం మొత్తం రచ్చ రచ్చవుతుంది.

ఒకేసారి అన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే ఎన్నింటిలో పార్టీ గెలుస్తుందో ఎవరు చెప్పలేరు. అపుడు లోకేష్ గెలుపు చంద్రబాబుకు పెద్ద సవాలవుతుంది. ఫలితం గనుక తల్లక్రిందులైతే అంతకిమించిన అవమానం ఇంకేముంటుంది? అందుకని లోకేష్ ను అసెంబ్లీకి పంపేది కల్లే. ఇక మిగిలింది కౌన్సిల్ మాత్రమే. అందులోనూ స్ధానిక సంస్ధల కోటాలో అయితే మరింత సేఫ్. ఎందుకంటే, పోటీ అన్నాక అసెంబ్లీ అయినా స్దానిక సంస్ధల కోటా అయినా ఒక్కటే అని టిడిపి నేతలు చెప్పుకోవచ్చు. పైగా తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి ఓట్లే ఎక్కువ. కాబట్టి గెలుపు కూడా సునాయసమే.

అయితే, ఈ జిల్లాలో ప్రస్తుతం ఎవరికే అవసరం వచ్చినా ముందుగా యనమల దగ్గరికే వెళతారు. అటువంటిది లోకేష్ కూడా ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహిస్తే రాజకీయ సమీకరణలు మారిపోతాయి కదా? మారాలనే కదా లోకేష్ ను తూర్పు నుండి పోటీ చేయించాలని ప్రయత్నాలు చేస్తూంట. పైగా లోకేష్ ను యనమల మొదటి నుండి పెద్దగా లెక్కచేయటం లేదని పార్టీలో ప్రచారం సాగుతోంది. అందుకనే లోకేష్ ను తూర్పు నుండి పోటీ చేయించాలని చంద్రబాబు కూడా అనుకుంటున్నట్లు సమాచారం. 2019 నాటికి లోకేష్ కు తూర్పు గోదావరిలో ఓ మంచి నియోజకవర్గాన్ని సెట్ చేయాలని కూడా చంద్రబాబు అనుకుంటున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా యనమలకు మాత్రం చెక్ పెట్టటం ఖాయంగా తెలుస్తోంది.