అక్రమ ఆస్తుల విషయంలో తనతో బహిరంగ చర్చకు రావాల్సిందిగా నారా లోకేష్ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరారు.
అక్రమ ఆస్తుల విషయంలో తనతో బహిరంగ చర్చకు రావాల్సిందిగా నారా లోకేష్ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. ఎంఎల్సీగా నామినేషన్ వేసిన లోకేష్ తన ఆస్తులను రూ. 330 కోట్లుగా అఫిడవిట్లో చూపారు. పోయిన అక్టోబర్ లో తన ఆస్తులు రూ. 14.50 కోట్లుగా ప్రకటించారు. అంటే కేవలం ఐదు నెలల్లోనే లోకేష్ ఆస్తుల విలువ 23 రెట్లు ఎలా పెరిగిందంటూ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఇంగ్లీష్ తో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో లోకేష్ అఫిడవిట్ పై విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. అదేవిధంగా సాక్షిలో కూడా కథనాలు వచ్చాయి. మిగిలిన వాటిని వదిలేసిన లోకేష్ కేవలం సాక్షిలో వచ్చిన కథనాలపై మాత్రమే దృష్టి పెట్టారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చారు.
ఆస్తులపై మొదలైన ప్రచారానికి లోకేష్ స్పందిస్తూ తన ఆస్తుల విషయంలో సాక్షి దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురించటం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. 12 కేసుల్లో ఏ 1 గా ఉన్న జగన్ పచ్చకామెర్ల రోగి లాగ వ్యవహరిస్తున్నట్లు ధ్వజమెత్తారు. గతంలో కూడా అక్రమ ఆస్తుల విషయంలో బహిరంగ చర్చకు రమ్మంటే ఇంతవరకూ స్పందించలేదని కూడా గుర్తుచేసారు. షేర్లలో పెరుగుదల వల్లే తన ఆస్తుల విలువలో పెరుగుదల కన్పించినట్లు లోకేష్ వివరణ ఇచ్చారు. స్వచ్చంధంగా ఆస్తులను వెల్లడిస్తున్న రాజకీయ కుటుంబం దేశం మొత్తం మీద తమది మాత్రమేనన్నారు. ఉత్తమ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు కూడా లోకేష్ చెప్పుకొచ్చారు.
