జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి  మద్దతు పెరుగుతోంది. సినిమాల్లో నటించాలంటూ ఆయన తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే ఓ టీడీపీ నేత సమర్థించగా.. ఇప్పుడు లోక్ సత్తా పార్టీ నేత జయ ప్రకాశ్ నారాయణ కూడా మద్దతుగా నిలిచారు. 

 పవన్ చివరగా అజ్ఞాతవాసి సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయాలో బిజీగా గడుపుతూ వచ్చారు. ఇక పవన్ నుంచి సినిమా రాదు అని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. 

అయితే... గడిచిన ఎన్నికల్లో పవన్ రాజకీయంగా ఎలాంటి ప్రాబల్యం చూపించలేకపోయారు. వచ్చే ఎన్నికలనాటికి పార్టీని బలోపేతం చేయాలని ఆయన యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. మళ్లీ ఎన్నికలు జరగడానికి చాలా సమయం ఉండటంతో... ఒకవైపు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే తాజాగా ఆయన సినిమాలపై దృష్టి సారించారు.

Also read జేడీ గారు.. సినిమాల్లో నటిస్తే తప్పేంటి...? పవన్ కి మద్దతుగా నిలిచిన టీడీపీ...

ఓ వైపు పింక్ రిమేక్ సినిమాలో నటిస్తూనే... మరో మూడు సినిమాలకు సంతకం చేశాడు. రాజకీయాలను పట్టించుకోకుండా పవన్ సినిమాల్లో నటించడానికి వెళ్లడం ఆ పార్టీ నేత మాజీ జేడీ లక్ష్మీనారాయణకు నచ్చలేదు. దీంతో... ఆయన ఇటీవల పార్టీని వదిలేశారు. పవన్ సినిమాల్లోకి వెళ్లడం ఇష్టంలేకనే తాను పార్టీని వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. 

దానికి పవన్ కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తాను కేవలం పార్టీ కార్యకర్తల కోసమే సినిమాల్లో నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు, జగన్ లు వ్యాపారాలు చేసుకుంటున్నారంటూ పరోక్షంగా ప్రవస్తాంచి.. తనకు అలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. తనకు సినిమాల్లో నటిస్తే మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పారు. 

కాగా... ఈ విషయంలో  ఇప్పటికే  పవన్ కి టీడీపీ మద్దతుగా నిలిచింది. పవన్ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటిచారని.. అలాంటప్పుడు పవన్ నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమి లేదంటూ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు.

ప్రస్తుతం ఈ విషయంపై జయప్రకాశ్ నారాయణ కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో తప్పేం లేదన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హీరో కాబట్టి, ఆయన సినిమాల్లో నటిస్తే డబ్బులు వస్తాయి. అవన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారని, మళ్లీ ఇప్పుడు మేకప్ వేసుకోవడం తప్పేం కాదన్నారు. సక్రమ మార్గంలో ఆదాయాన్ని ఆర్జించడం తప్పేం కాదని స్పష్టం చేశారు. 

‘నిజాయితీగా గౌరవప్రదంగా సంపాదించుకుంటున్నప్పుడు ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తన పార్టీని కాపాడుకోవడానికో, లేదంటే తన చుట్టూ ఉన్న వారి భవిష్యత్తు గురించి ఆలోచించో సినిమాల్లో నటిస్తే దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు.’ అని జేపీ అభిప్రాయపడ్డారు.