ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారిపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన  భర్త అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడనిఫిర్యాదు చేసిన భార్య అతడి నుండి తనను రక్షణ కల్సించాలంటూ పోలీసులను కోరింది.  తన భర్త నుండి విడాకులు ఇప్పించాలని ఐఏఎస్ భార్య తన ఫిర్యాదులో పేర్కొంది.  

ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఏపికి చెందిన ఐఏఎస్‌ అధికారి గంధం చంద్రుడు, సరోజలు భార్యాభర్తలు. వీరికి కొన్నేళ్ల క్రితం వివామైంది. గతంలో విజయవాడ జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన చంద్రుడు ప్రస్తుతం గిరిజన సంక్షేమశాఖ ఎండీగా వెళ్లారు. వీరు విజయవాడ లోని ఎక్సైజ్ కాలనీలో నివాసముంటున్నారు.

అయితే తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ సరోజ ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె విజయవాడ మాచవరం పోలీస్‌ స్టేషన్‌ లో భర్త పై ఫిర్యాదు చేసింది. కట్నం విషయంలో తరచూ వేధింపులకు దిగుతూ మానసికంగా హింసిస్తున్నాడని పోలీసులకు తెలిపారు. 

అయితే ఐఏఎస్ అధికారిపై ఫిర్యాదు కావడంతో పోలీసులు జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నారు. సరోజ ఫిర్యాదుపై డీసీపీ గజరావు భూపాల్‌ స్పందిస్తూ...498A కింద వచ్చే ప్రతి ఫిర్యాదును లీగల్ సెల్ కు పంపిస్తామని, అలాగే ఈ ఈ కేసును కూడా మండల లీగల్‌సెల్‌కు పంపాలని మాచవరం పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. లీగల్‌సెల్‌లో భార్యాభర్తలు ఇరువురికీ జూలై 10 న కౌన్సెలింగ్‌ ఇస్తారని, ఆ తర్వాత కూడా మార్పురాని పక్షంలో అప్పుడు కేసు నమోదుచేస్తామని ఆయన తెలిపారు.