ప్రకాశం జిల్లాలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలోని 19 ప్రాంతాలను గుర్తించారు. ఒంగోలు నగరం సహా కందుకూరు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరుతో పాటు మండల కేంద్రాల్లో ఆంక్షలు విధించాలని కలెక్టర్ నిర్ణయించారు.

ఎల్లుండి నుంచి జిల్లాలోని 19 ప్రాంతాల్లో 10 రోజుల పాటు ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇచ్చినట్లుగా కలెక్టర్ వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. ఏ రోజుకారోజు కొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా తీవ్రత అధికంగా వున్న మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్ రాష్ట్రాలతో ఏపీ పోటీ పడేందుకు సిద్ధంగా వున్నట్లుగా అనిపిస్తోంది.

Also Read:ఏపీలో ప్రమాద ఘంటికలు: ఒక్కరోజులో 9,716 కేసులు.. పెరుగుతున్న మరణాలు, యాక్టీవ్ కేసులు

రోజువారీ కేసులు పది వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,716 మందికి పాజిటివ్ తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల  సంఖ్య 9,86,703కి చేరింది. నిన్న ఒక్కరోజు కోవిడ్ వల్ల 38 మంది మృత్యువాత పడ్డారు. దీంతో వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,510కి చేరింది.