ఏలూరులో పేకాటరాయుళ్లు దారుణానికి తెగబడ్డారు. పేకాట ఆపేందుకు వచ్చిన ఎస్సై మీద స్థానికులు తిరగబడ్డారు. తిడుతూ దాడికి తెగబడ్డారు. పరిగెత్తించి...ఎస్సై చొక్కా లాగి మరీ బీభత్సం సృష్టించారు.
ఏలూరు : poker, కోడిపందేలు నిర్వహిస్తున్నారని సమాచారంతో.. వాటిని అడ్డుకోవడానికి వెళ్ళిన ఎస్సైని గ్రామస్తులు పరిగెత్తించి, చొక్కా లాగి కొట్టిన ఘటన eluru జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఎర్రవల్లిలో పేకాట, కోడి పందేలు ఆడుతున్న విషయం తెలిసి.. ధర్మాజీ గూడెం స్టేషన్ కానిస్టేబుళ్ళు ఇద్దరూ అక్కడికి వెళ్లారు. స్థానికులు దుర్భాషలాడడంతో వారు స్టేషన్కు సమాచారం అందించారు.
ఏఎస్ఐ రాంబాబు మరో కానిస్టేబుల్ తో కలిసి ఎడవల్లి చేరుకుని వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వారు పోలీసులపై తిరగబడ్డారు. రాంబాబు ఎస్సై దుర్గా మహేశ్వరరావుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకు ఎస్సైకి, స్థానికులకు వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు యూనిఫాంలో ఉన్న ఎస్సైపై దాడి చేశారు. రహదారిపై పరిగెత్తిస్తూ, చొక్కా లాగేసి మరీ కొట్టారు. ఎస్సై కి గాయాలై, పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని సమాచారం. దీంతో సిఐ మల్లేశ్వరరావు అక్కడికి వెళ్లి ఎస్ఐని చికిత్స నిమిత్తం చింతలపూడి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సీఐ మల్లేష్ దుర్గారావు మాట్లాడుతూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు వ్యక్తిగత కక్షతో ఎస్సై దుర్గా మహేశ్వర రావుపై దాడి చేశారు. వారిలో కొందరిని గుర్తించామని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా, నిరుడు జులైలో తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. జగిత్యాల జిల్లాలో ఇసుక మాఫియా పోలీసులపై దాడికి దిగింది. ఈ ఘటనలో మల్లాపూర్ ట్రైనీ ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులపై దాడికి దిగిన ఇసుక మాఫియా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అక్రమార్కులు నిబంధనలకు విరుద్దంగా జేసీబీల సహాయంతో ఇసుకను రాత్రిపూట తరలిస్తున్నారనే విషయమై తెలుసుకొన్న ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుళ్లు ఇసుక తరలిస్తున్న ప్రాంతానికి చేరుకొన్నారు.
అయితే పోలీసులను గుర్తించిన ఇసక మాఫియా దాడికి దిగింది. పోలీసులపై దాడికి దిగిన ఇసుక మాఫియా అక్కడి నుండి పారిపోయారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ గౌస్ బాబా సందర్శించారు. గాయపడిన ఎస్ఐ , ముగ్గురు కానిస్టేబుళ్లను ఆసుపత్రి తరలించారు.
కాగా, నిరుడు ఏప్రిల్ లో సిద్దిపేటలో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా, కోహెడలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ ను ఆపడానికి ప్రయత్నించిన కోహెడ పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోట్ పోలీసులపై దాడి స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కొహెడ మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గొడవ జరుగుతుందనే సమాచారం అందింది.
గొడవ జరుగుతుండడంతో స్థానికులు 100 డయల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో దాన్ని నియంత్రించడానికి వెళ్లిన బ్లూకోట్స్ కానిస్టేబుల్ మోహన్, లక్ష్మణ్ లపై గొడవకు కారణమైన నజీమొద్దిన్ తిరగబడి కొట్టడంతో మోహన్ అనే కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రాజ్ కుమార్ గాయాలైన మోహన్ ను కరీంనగర్ లోని అపోలో ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. కోహెడ ఎస్ఐ రాజకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
