బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ కారణంగా ఏపీ తీరంలో విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న శ్రీకాకుళం జిల్లా సున్నాపల్లి తీరానికి బంగారు రథం కొట్టుకొచ్చింది. తాజాగా ఉప్పాడ తీరంలో బంగారం బయటపడుతుండటంతో జనం ఏరుకునేందుకు ఎగబడుతున్నారు.
బంగాళాఖాతంలో (bay of bengal) ఏర్పడిన అసని తుఫాను (cyclone asani) కారణంగా ఏపీ కోస్తా తీరం వణుకుతోంది. అయితే తుఫాను ఉప్పాడ సముద్ర తీర ప్రాంత వాసులకు (uppada beach) కాసుల వర్షం కురిపిస్తోంది. సముద్ర తీరంలోని మట్టిలో బంగారం దొరుకుతోందని జనం క్యూ కట్టారు. కెరటాల ఉద్ధృతికి తీర ప్రాంతంలోని మత్స్యకారుల ఇళ్లు , దేవాలయాలు కోతకు గురై సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. కట్టడాలు , నిర్మాణ సమయంలో భూమిలో వేసే బంగారపు ముక్కలతో పాటు పూర్వీకులు దాచుకున్న వెండి నాణేలు బయటపడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బంగారం కోపం ఉప్పాడ బీచ్‌కు చేరుకుంటున్నారు. జోరు గాలి, భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బీచ్‌లో బంగారం కోసం వేటాడుతున్నారు.
గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్ సమయాల్లో బయటపడుతూ వుంటాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. బంగారం దొరుకుతుండటంతో మత్స్యకారులు, స్థానికులు, సమీప ప్రాంతాల ప్రజలు ఉప్పాడ తీరంలోనే తిష్టవేశారు. గతేడాది నవంబర్‌లో కూడా ఇలాగే బంగారం కోసం జనాలు గాలించారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసని తుఫాను వల్ల తీరప్రాంతం అలజడిగా వుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల్లో భారీవర్షాలు పడుతున్నాయి. అయితే తుఫాను కారణంగా ఓ మందిరం (golden chariot) తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. అసని తుఫాను ప్రభావంతో మరో దేశానికి చెందిన ఓ మందిరం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది.
ఈ విషయం దావానంలా వ్యాపించడంతో అక్కడి ప్రజలు దీనిని వీక్షించేందుకు ఎగబడుతున్నారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాష లో లిఖించి వుంది. ఇది మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని అధికారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదంటున్నారు. దీనిని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది ఎక్కడినుంచి కొట్టుకువచ్చింది అనే విషయం తెలియాల్సి ఉంది.
