న్యూడిల్లి: ఏపి స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ వైసిపి ప్రభుత్వం వేసిన పిటిషన్ పై రేపే(బుధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ఈ విచారణను చేపట్టననున్నారు. ప్రభుత్వం కోరుకున్నట్లు స్థానికసంస్థల ఎన్నికలు యధావిధిగా జరుగుతాయా లేక ఎలక్షన్ కమీషన్ నిర్ణయాన్నే న్యాయస్థానం సమర్థిస్తుందా అన్న ఉత్కంఠకు తెరపడే అవకాశాలున్నాయి. 

స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని  సుప్రీంలో పిటిషన్  దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. 

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకుందని న్యాయస్థానానికి తెలియజేసింది.ఈ వాయిదా  నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో కనీసం సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదని పిటిషన్ లో పేర్కోంది. ఎన్నికల నిర్వహణ కు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు ఇది విరుద్దమని అన్నారు. 

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం అవుతారని తెలిపింది. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం ఇస్తుందని తెలిపింది. హై కోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా ? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాలి అని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్ లో జగన్ ప్రభుత్వం పేర్కొంది.