అప్పు చేసి పప్పు కూడు

Loans
Highlights

ఎవరు అప్పుచేసినా తీర్చాల్సింది, భారాన్ని మోయాల్సింది మాత్రం ప్రజలేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రభుత్వం అప్పులు చేస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

‘అప్పుచేసి పప్పు కూడు తినరా ఓ నరుడా’ అని దాదాపు 60 ఏళ్ళ క్రితమే ఓ సినీ కవి పాట రాసారు. బహుశా రాష్ట్ర ప్రభుత్వం దానిని అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. ఇదంతా ఎందుకంటే, విదేశీ సంస్ధల నుండి నేరుగా అప్పులు తెచ్చుకునేందుకు తమను అనుమతించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి ఇటీవలే ఓ లేఖ రాసారు.

అది కూడా ఏకంగా విదేశాల నుండి అప్పులట. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ప్రభుత్వం అప్పులమీద అప్పులు చేస్తూనే ఉన్నది. చేసిన అప్పులకు ఎలాగూ వడ్డీలు కట్టాల్సిందే కదా అందుకు మళ్ళీ ఏదో ఒక రూపంలో ప్రజలపై పన్నులు వేయాల్సిందే.

   అసలు విభజన చట్టాన్ని గనుక కేంద్రప్రభుత్వం అమలు చేసి ఉంటే రాష్ట్రానికి చాలా వరకూ ఆర్ధిక బాధలు తప్పేవని నిపుణులు అంటున్నారు. ప్రత్యేకహోదా బదులు కేంద్రం రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక సాయంతో పాటు ఏడాదికి రూ. 3500 కోట్లు అప్పు చేసేందుకు అనుమతించాలని చంద్రబాబు జైట్లీకి ఓ లేఖ రాసారు. సరే ఆ అప్పు విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే, సదరు అప్పును కేంద్రమే తీరుస్తుంది.

  అయితే ఆ లేఖతో పాటు ముఖ్యమంత్రి మరో లేఖ కూడా రాసారు. అదేమిటంటే, రాష్ట్రంలో అమలవుతున్న  ప్రాజెక్టులకు అవసరమైన ఆర్ధిక వనరుల సమీకరణలో భాగంగా విదేశీ సంస్ధల నుండి నేరుగా అప్పు తీసుకునేందుకు అనుమతించాలని. కేంద్రంతో నిమ్మితం లేకుండా రూ. 21 వేల కోట్ల నిధుల సమీకరణను లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నది. ఇక్కడే ఆర్ధిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

చంద్రబాబు అధికారంలో కొనసాగటానికి ఇక ఉన్నది కేవలం రెండున్నరేళ్ళే. అందులోనూ విదేశీ అప్పులకు కేంద్రం అనుమతించినా కావాల్సిన అప్పుల కోసం విదేశీ సంస్దలతో సంప్రదింపులు జరపటం, ప్రతిపాదనలు అందచేయటం, సంస్ధలు వచ్చి క్షేత్రస్ధాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే రుణం మంజూరు అవుతుంది. ఇదంతా పూర్తవటానికి కనీసం ఆరు మాసాలు పడుతుంది. అంటే విదేశీ సంస్ధల నుండి రుణం అందే సమయానికి ఇక చంద్రబాబుకు ఉండే కాలవ్యవధి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. మరో ఏడాది గడిస్తే ఇక ఉన్నదంతా ఎన్నికల సంవత్సరమే.

 సరే, ఎవరు అప్పుచేసినా తీర్చాల్సింది, భారాన్ని మోయాల్సింది మాత్రం ప్రజలేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రభుత్వం అప్పులు చేస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. అప్పులు చేసే ముందు వృధా ఖర్చులను తగ్గించుకోవటం, ఆడంబారాలను మానుకోవటం తదితరాలపై దృష్టి పెడితే బాగుంటుందని కూడా పలువురు సూచిస్తున్నారు.

loader