అమరావతి: రాష్ట్రంలో కుక్కలు, పందులకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పందుల పెంపకందారులు, కుక్కలను పెంచుకునే వారు లైసెన్స్ లు తీసుకోవాలని ఏపి పంచాయతీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ జీవో నంబరు 693 విడుదల చేసింది.

ఇక లైసెన్స్ లేని కుక్కలను, పందులను అధికారులు పట్టుకుంటే రూ.500 ఫైన్ తో పాటు రోజుకు 250 అపరాద రుసుము విధించనున్నట్లు తెలిపారు. అధికారులు పట్టుకున్న పందులు, కుక్కల యజమానులు నిర్ధారణ కాకపోతే వాటిని వీది కుక్కలుగా పరిగణించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని స్థానిక సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

కుక్కలు, పందుల లైసెన్స్ గడువు ముగిసిన 10రోజుల్లోగా వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి వుంటుందన్నారు. లైసెన్స్ కావాలంటే కుక్కలకు, పందులకు హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలని... కుక్కలకు హెల్త్ సర్టిఫికేట్, పందులకు వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని సూచించారు.

ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలోని కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీ చేయాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించింది. ఆ టోకెన్లు పెంపుడు జంతువుల మెడలో వేసి ఎప్పుడూ వుండేలా చూడాలని సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.