విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఇంకా పరిసరాల్లో ప్రభావం చూపుతునే ఉంది. ఆర్ఆర్ వెంకటాపురంలో విషవాయువు ప్రభావం కనిపిస్తోంది. విషవాయువు ప్రభావంతో వీఆర్వో తులసి సచివాలయంలో సొమ్మసిల్లి పడిపోయారు. 

మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఆర్ఆర్ వెంకటాపురంలోని ఇళ్లలో సొమ్మసిల్లి పడిపోయారు. వారికి గోపాలపట్నం ఆస్పత్రిలోచ చికిత్స అందిస్తున్నారు.  ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. 

పలువురు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ ప్రభావం సమసిపోయిందని నిరూపించడానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, రాష్ట్ర మంత్రులుకొందరు వెంకటాపురంలో రాత్రిపూట నిద్రించారు. 

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార వైసీపి, ప్రతిపక్ష టీడీపీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ అనంతర ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండగా, ఎల్జీ పాలిమర్స్ కు అనుమతులు ఇచ్చింది చంద్రబాబేనని వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది.