విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ జ్యువెలరీ సంస్థ లలితా జ్యువెలరీ దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులకు దిగారు. ఏపీలోని విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో ఏకకాలంలో తూనికల కొలతల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 

పరీక్షల కోసం కొంతమేర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం నాణ్యత, తూకం, నెలవారీ పథకాలు, ప్రైజ్‌మనీ చిట్స్ అంశాలపై ఆరా తీశారు. తూనికలు, కొలతల శాఖ కమిషనర్‌ దామోదర్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. 

సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు అని అధికారులు స్పష్టం చేశారు. లలిత జ్యూవెలరీతోపాటు కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఉన్న కళ్యాణ్ జ్యూవెలరీ, జోస్ అలుకాస్ దుకాణాలలో కూడా తనిఖీలు నిర్వహించారు. 

అలాగే ఏలూరులోని వైభవ్ జ్యూవెలరీ దుకాణాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మెుత్తానికి రాష్ట్రంలో ఒక్కసారిగా ప్రముఖ బంగారు దుకాణాల్లో తూనికలు కొలతల శాఖ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది.