రెడ్ బుక్ లో పేర్లున్న నేతలు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే. - ఎంపీ కింజరాపు రామ్మోహన్
ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS JAGAN MOHAN REDDY), వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్ (Kinjarapu Ram Mohan)తీవ్ర విమర్శలు చేశారు. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామని చెప్పిన జగన్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు. టీడీపీ–జనసేన (TDP-JANASENA Alliance) ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు.
రెడ్ బుక్ లో పేర్లు ఉన్న నాయకులు, అధికారులు ఇకపై రోజులు లెక్కబెట్టుకోవాల్సిందే అని టీడీపీ నాయకుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. ఇచ్చాపురంలో నిర్వహించిన ‘శంఖారావం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నారా లోకేష్ రాష్ట్ర ప్రజలందరి గొంతును యువగళంగా మార్చుకొని పాదయాత్ర చేశారని అన్నారు. ఆ పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగించాల్సి ఉన్నా అవాంతరాల వల్ల రాలేకపోయారని అన్నారు. కానీ మాట ప్రకారం లోకేష్ నేడు ఈ గడ్డపై శంఖారావంతో అడుగుపెట్టారని అన్నారు.
ఏపీ సీఎం జగన్ రెడ్డి పాలన అంతానికి లోకేష్ శంఖారావం పూరించారని కింజరాపు రామ్మోహన్ అన్నారు. ఇది రైతులు, యువకులు, బడుగు, బలహీనవర్గాల అందరి కోసం అని తెలిపారు. జగన్ రెడ్డిని నమ్మి రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని ఆయన అన్నారు. ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో గడిపిన సీఎం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వస్తే మీడియా ఏం అడుగుతుందేమో అని సీఎం జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని తెలిపారు. జగన్ రెడ్డి ఢిల్లీకి వస్తే ఆ పార్టీ ఎంపీలు ఒక్కరూ కూడా రాలేదని ఆరోపించారు.
జగన్ రెడ్డి పని అయిపోయిందని వైసీపీ నేతలకు కూడా తెలిసిపోయిందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ విమర్శించారు. ఎంపీలో ఒకరు దుబాయి పారిపోతే, మరి కొందరు నియోజకవర్గాలకు పారిపోయారని ఆరోపించారు. అనేక తుఫానులను ఎదుర్కొన్నామని, జగన్ రెడ్డిని ఓడించడం పెద్ద లెక్క కాదని తెలిపారు. 2014-19 మధ్య అనేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తిచేస్తామని చెప్పారు. టీడీపీ అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉండే పార్టీ అని అన్నారు. పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తామని అన్నారు.
25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారని ఎంపీ రామ్మోహన్ ఆరోపించారు. జగన్ కు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడిగే దమ్ము లేక భయపెట్టి ఓట్లు వేయించుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని తెలిపారు. ప్రకృతి విపత్తులకే తాము భయపడలేదని, జగన్ ఉడత ఊపులకు భయపడతామా అని ప్రశ్నించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ హయాంలో కోట్లాదిరూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
రైతులకు సాగునీటి కాల్వల కోసం రూ.4కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని ఎంపీ కింజరాపు రామ్మోహన్ చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం అయిదేళ్లలో కెనాల్స్ లో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని ఆరోపించారు. టీడీపీ – జనసేన ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గంలో పసుపుజెండా ఎగురవేసి లోకేష్ కు కానుకగా ఇద్దామని తెలిపారు. తెలుగువారి గళం ఢిల్లీలో వినపడాలంటే తెలుగుదేశం పార్టీకి ఘన విజయం అందించాలని అన్నారు.