ఆ ఎఫ్ఐఆర్ చట్టవిరుద్దం: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాడీ వేడీ వాదనలు

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై  ఏపీ హైకోర్టులో వాడీ వేడీగా వాదనలు జరిగాయి. ఈ విషయమై ఏపీ సీఐడీ తరపు న్యాయవాది తన వాదనలు విన్పించనున్నారు.

lawyers urged AP High court To quash FIR On Chandrababu naidu in ap skill development case lns

అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దాఖలు చేసిన  క్వాష్ పిటిషన్ పై  మంగళవారంనాడు ఏపీ హైకోర్టులో వాడీ వేడీగా వాదనలు జరిగాయి.  చంద్రబాబునాయుడుపై  ఏపీ సీఐడీ దాఖలు  చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని  పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై  ఇవాళ  ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి.  విదేశాల్లో ఉన్న చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే  వర్చువల్ గా  తన వాదనలను కొనసాగించారు.

2020 లో నమోదైన ఎఫ్ఐఆర్ తో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని  హరీష్ సాల్వే ప్రశ్నించారు.అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్ అనుమతి కూడ తీసుకోని విషయాన్ని సాల్వే ఈ సందర్భంగా గుర్తు చేశారు.చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆయనను అరెస్ట్ చేయడం  చట్ట విరుద్దమని  సాల్వే కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. నోటీసులు ఇవ్వకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. 17 ఏ ప్రకారంగా  ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని సాల్వే గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు రిమాండ్ ను సస్పెండ్ చేయాలని,  చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కూడ క్వాష్ చేయాలని  సాల్వే వాదించారు. సాల్వే వాదనను బలపరుస్తూ సిద్దార్థ్ లూత్రా కూడ తన వాదనలు వినిపించారు.

.  మరోవైపు సీఐడీ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పించనున్నారు. మరో వైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా  సీఐడీ సాక్ష్యాలను సృష్టిస్తుందని  ఆయన తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా పేర్కొన్నారు.ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని  ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ఏపీ సిల్క్ డెవలప్ మెంట్ పథకం ద్వారా  ఏ మేరకు  ప్రయోజనం కలిగిందనే విషయమై రాత పూర్వకంగా  కోర్టుకు  ఆధారాలను అందించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఎంత మంది  అభ్యర్థులు ప్రయోజనం పొందారనే విషయాన్ని కూడ అందించారు.409 సెక్షన్ కింద ఆధారం సమర్పించకుండా  చంద్రబాబును రిమాండ్ చేయడం సరైంది కాదని  బాబు తరపు న్యాయవాదులు వాదించారు.  అరెస్ట్ చేసిన తర్వాత  చంద్రబాబు నుండి  సమాచారం తీసుకొనేందుకు సీఐడీ ప్రయత్నిస్తుందని  బాబు లాయర్లు  కోర్టులో వాదించారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో గతంలో జరిగిన దర్యాప్తుపై  సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారని సాల్వే గుర్తు చేశారు.అవినీతి నిరోధక చట్టం 17ఏ కింద తగిన అనుమతులు తీసుకోలేదన్నారు.గతంలో వచ్చిన జడ్జిమెంట్లను  అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారని హరీష్ సాల్వే కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.ఈ సందర్భంగా  స్టేట్ ఆఫ్ రాజస్థాన్, తేజ్ మల్ చౌదరి కేసును హరీష్ సాల్వే హైకోర్టు ముందు ప్రస్తావించారు. నేరం ఎప్పుడు జరిగిందన్నది కాదు.. దర్యాప్తు సమయంలో చట్టబద్దత ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని సాల్వే కోరారు.2018  చట్ట సవరణ తర్వాత రిజిస్టర్ అయిన ప్రతి ఎఫ్ఐఆర్ కు 17 ఏ వర్తిస్తుందని  సాల్వే గుర్తు చేశారు.యువతలో సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ది చేసేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్టుగా సాల్వే చెప్పారు.  ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు  కోర్టులో వాదనలు జరిగాయి.  లంచ్ కోసం  మధ్యాహ్నం రెండు గంటల నుండి  రెండున్నర గంటల వరకు విరామం ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత  వాదనలు తిరిగి ప్రారంభమయ్యాయి.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios