రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన లాయర్ లక్ష్మీనారాయణ..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును న్యాయవాది లక్ష్మీనారాయణ కలిశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసి.. పలు అంశాలపై చర్చించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును న్యాయవాది లక్ష్మీనారాయణ కలిశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసి.. పలు అంశాలపై చర్చించారు. చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై మరికాసేపట్లో తీర్పును వెలువడనున్న నేపథ్యంలో తదుపరి ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై చంద్రబాబుతో ఆయన చర్చించినట్టుగా తెలుస్తోంది. హౌస్ రిమాండ్‌కు అనుమతిస్తే తర్వాత ఏం చేయాలి? అనుమతి లభించకపోతే ఎలా ముందుకు సాగాలి? అనే అంశాలపై చంద్రబాబు నుంచి ఆయన సూచనలు తీసుకున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా పలు లీగల్ పత్రాలకు సంబంధించి సంతకాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, లీగల్ ములాఖత్‌గా జైలు అధికారులు ఈ భేటీకి అనుమతించారు.
ఇదిలాఉంటే, ఈ రోజు సాయంత్రం చంద్రబాబును జైలులో ఆయన కుటుంబ సభ్యులు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు జైలులో చంద్రబాబును భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి కలవనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారు రాజమండ్రికి చేరుకున్నారు.
ఇక, చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాదులు కోరుతున్నారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారని.. ఆయనకు జైలులో ప్రమాదం ఉందని సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా అన్నారు. ఆయనకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. హౌస్ రిమాండ్‌కు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావించారు.
అయితే చంద్రబాబుకు హౌస్ రిమాండ్‌ను సీఐడీ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుకు ఇంట్లో కంటో జైలులో భద్రత ఉంటుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రతను కల్పించినట్టుగా చెప్పారు. జైలు లోపల, బయట పోలీసుల భద్రత ఉందని తెలిపారు. అవసరమైతే వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును చంద్రబాబు కేసుకు ముడిపెట్టవద్దని అన్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కోరారు. రాజమండ్రి జైలులో తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డీజీ నుంచి వచ్చిన లేఖను కూడా కోర్టుకు మసర్పించారు.
సోమవారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. సోమవారం సాయంత్రం వాదనలు ముగియగా.. న్యాయమూర్తి మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెల్లడించనున్నట్టుగా తెలిపారు.