దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబాన్ని రాజకీయంగా అన్నివిధాలా ఆదుకుంటామని సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం బల్లి దుర్గాప్రసాద్ భార్య, కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వెల్లడించారు. శాసన మండలిలో మొదట ఏ స్థానం ఖాళీ అయితే, ఆ స్థానంలో కల్యాణ్ చక్రవర్తిని ఎమ్మెల్సీగా చేస్తామని బొత్స పేర్కొన్నారు.

Also Read:తిరుపతి ఎంపీ స్థానానికి ఉపఎన్నికలు: డాక్టర్ గురుమూర్తి పేరును ప్రకటించిన వైసీపీ

తనతోపాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో బల్లి కళ్యాణ్ చక్రవర్తి నడవాలన్నది జగన్ ఆకాంక్ష అని మంత్రి చెప్పారు. కళ్యాణ్ మాట్లాడుతూ.. తన తండ్రి కరోనా బారినపడిన నాటి నుంచి జగన్ తమకు అండగా నిలిచారని గుర్తుచేశారు.

ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన వెంటనే మొదటి స్థానం తనకే ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని ఆయనకు తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. తన తండ్రి స్థానంలో ఖాళీ అయిన తిరుపతిలో జరగనున్న ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించేలా కృషి చేస్తానని కల్యాణ్  స్పష్టం చేశారు.