Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో లక్ష్మీపార్వతి... సీఎం జగన్, చంద్రబాబు లపై ఆసక్తికర వ్యాఖ్యలు

విజయవాడ కేంద్రంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

Lakshmi Parvati at NTR District Collectors office
Author
Vijayawada, First Published Apr 4, 2022, 1:12 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా నుండి విడిపోయి విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ’(ntr district) ఏర్పడింది. టిడిపి (TDP) వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గౌరవార్థం ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటుచేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ (YS Jagan) విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. నందమూరి కుటుంబం కూడా ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటుచేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి (lakshmi parvathi) కూడా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

నూతన జిల్లాల నుండి పాలనను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్ఠీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి వెళ్లారు. తన భర్త పేరిట ఓ జిల్లాను ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి జగన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి చీఫ్ చంద్రబాబు, ఆ పార్టీ నాయకులపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. 

''దివంగత ఎన్ఠీఆర్ ఫోటోలు, విగ్రహాలకు చంద్రబాబు దండలు వేస్తారు... పొగుడుతారు. అంతేగానీ ఆ మహనీయుడి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని బలవంతంగా లాక్కున్నారు. ఇలా సీఎం పదవి దక్కడానికి కారణమైన ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏమీ చేయలేదు'' అని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేసారు. 

''సీఎం వైఎస్ జగన్ కి ఎన్ఠీఆర్ తో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికి గొప్పనాయకుడు కాబట్టే విజయవాడ కేంద్రంగా ఏర్పాటుచేసిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి అధ్యక్షుడిగి వున్న చంద్రబాబుకు అన్ని అధికారాలు వుండికూడా ఇలాంటి పని చేయలేకపోయారు.  చంద్రబాబు చేయలేని పని జగన్ చేస్తున్నారు. టిడిపి నాయకుడు చేయలేని పని మా నాయకుడు చేశారు'' అన్నారు. 

''కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పెద్దల పేర్లు పెట్టడం ద్వారా వారి ఆశిస్సులను సీఎం జగన్ పొందారు. ఎన్టీఆర్ పేరుతో ఏర్పడిన జిల్లా ఏపీలోని మిగతా జిల్లాలకంటే మంచి పేరు తెలచ్చుకోవాలని కోరుకుంటున్నా. అధికారులు కూడా ఈ జిల్లా అభివృద్దికి శక్తివంచన లేకుండా పనిచేయాలి'' అని లక్ష్మీపార్వతి కోరారు. 
 
ఎన్ఠీఆర్ పుట్టింది నిమ్మకూరు జిల్లాల విభజన తర్వాత కృష్ణా జిల్లాలోనే వుండిపోయింది... కాబట్టి మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడిన ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న డిమాండ్ ను లక్ష్మీపార్వతి తప్పుబట్టారు. నిమ్మకూరు ఒక మూలన ఉన్న పల్లెటూరు...విజయవాడ అందరికీ తెలిసిన పేరని అన్నారు. అంతేకాకుండా విజయవాడతోనే ఎన్టీఆర్ కు ఎక్కువగా అనుబంధం వుంది కాబట్టి ఈ జిల్లాకే ఎన్టీఆర్ పేరుపెట్టడం సమంజసమని వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు కాకుండా వంగవీటి రంగ పేరు పెట్టాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. కృష్ణా జిల్లాకు రంగా చేసిన సేవను గుర్తించుకొని వంగవీటి రంగా జిల్లాగా పేరు పెట్టాలని రంగా-రాధ మిత్ర మండలి డిమాండ్ చేసింది. అయినప్పటికి ఎన్టీఆర్ పేరునే విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు కన్ఫర్మ్ చేసింది జగన్ సర్కార్. 

Follow Us:
Download App:
  • android
  • ios