Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబును క్షమించమని నేను ఆనాడూ ఎన్టీఆర్‌ను కోరాను.. లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్‌తో తన వివాహం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదని లక్ష్మీపార్వతి అన్నారు. చనిపోవడానికి 11 రోజుల ముందు  ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ అనేక విషయాలన ప్రస్తావిచారని తెలిపారు. 

lakshmi parvathi sensational comments chandrababu naidu
Author
First Published Sep 26, 2022, 12:35 PM IST

ఎన్టీఆర్‌తో తన వివాహం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్‌తో తన పెళ్లి తిరుపతిలో జరిగిందని తెలిపారు. మీడియా ముందే ఎన్టీఆర్‌తో తన వివాహం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్‌తో తన వివాహం చంద్రబాబు నాయుడుకు మొదటి  నుంచి ఇష్టం లేదని అన్నారు.  తన వివాహం గురించి తప్పుగా మాట్లాడితే కేసు పెడతానని హెచ్చరించారు. సోమవారం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. వాస్తవాలు మాట్లాడేందుకే తాను మీడియా సమావేశం నిర్వహించినట్టుగా చెప్పారు. ఎన్టీఆర్‌తో తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను లక్ష్మీపార్వతి మీడియాకు చూపించారు. 

చనిపోవడానికి 11 రోజుల ముందు  ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ అనేక విషయాలు చెప్పారని అన్నారు. అందులో తమ వివాహం, తనపై ఆయన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారని అన్నారు. ఆయన గుండెల్లో తాను దేవతగా కొలువు ఉన్నానని చెప్పారు. కొందరు ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. గతంలో తనపై దుష్ప్రచారం చేసినట్టే ఇప్పుడు కొందరు జూనియర్ ఎన్టీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

Also Read: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన లక్ష్మీపార్వతి.. ఏమన్నారంటే..

తనను రాజకీయాల్లోకి తీసుకొస్తానని ఎన్టీఆర్ ఏనాడూ చెప్పలేదని అన్నారు. చరిత్రను ఎవరూ చెరిపేయలేరని అన్నారు. ఎన్టీఆర్‌కు అప్పుడు ఏం జరిగింది ఇప్పటి తరం తెలుసుకోవాలని అన్నారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసినవారు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని  ప్రశ్నించారు. తనకు పదవి కావాలని ఏనాడూ ఎన్టీఆర్‌‌ను అడగలేదని చెప్పారు. తనకు టెక్కలి సీటు ఆఫర్ చేసిన కూడా తీసుకోలేదని తెలిపారు. ఎన్టీఆర్ భార్యగా కంటే పెద్ద పదవి ఏదీ లేదని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూసి మాట్లాడాలని కోరారు. 

మోహన్‌బాబు వద్ద కూడా తనను మంత్రి పదవి తీసుకోమని ఎన్టీఆర్ చెప్పారని తెలిపారు. మోహన్ బాబు నిజాయితీ పరుడైతే నిజం చెప్తాడని అన్నారు. తాను ఏ స్వార్ధం కోసం కూడా ఎన్టీఆర్ జీవితంలోకి రాలేదని చెప్పారు. ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానం గురించి అందరికీ తెలుసని అన్నారు. అప్పట్లోనే పత్రికల్లో వస్తున్న పిచ్చి రాతలపై ఎన్టీఆర్ స్పందించారని చెప్పారు. తనకు కించపరిచేలా పత్రికల్లో కార్టూన్స్ వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 1989‌లో ఇద్దరు అల్లుళ్ల కొట్లాట వల్లే పార్టీ ఓడిపోయిందని ఎన్టీఆర్ తనతో చెప్పినట్టుగా తెలిపారు. తాను ఆయన జీవితంలో ప్రవేశించాకే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని తెలిపారు. 

అధికారంలోకి వచ్చిన తర్వాతే 8 నెలల్లోనే అసమ్మతి వస్తుందా? అని ప్రశ్నించారు. ఎవరో కుట్ర చేయబట్టే కదా ఆ రోజు అసమ్మతి వచ్చిందని అన్నారు. 1994 ఎన్నికలకు ముందే రామోజీరావు, చంద్రబాబు కలిసి కుట్ర చేశారని.. అయితే భారీ మెజారిటీ రావడంతో ప్లాన్ మార్చుకున్నారని ఎన్టీఆరే చెప్పారు. ఆనాడూ తప్పుడు ప్రచారంతో ఎమ్మెల్యేల్లో భయాందోళనలు సృష్టించారని అన్నారు. అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు వెన్నుపోటులో భాగమయ్యారని ఆరోపించారు. 

‘‘నేను ఎలాంటి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించలేదు. నాకు నిజంగా అధికార అపేక్ష ఉంటే.. చంద్రబాబుకు కీలకమైన రెండు పదవులు వచ్చేవా?. నేను నిజంగా రాజకీయ ప్రయోజనాల కోసమే వచ్చి ఉంటే చంద్రబాబు ఎదగకుండా అడ్డుకుని ఉండేదానిని కదా?. చంద్రబాబు నా వద్దకు వచ్చి అత్తమ్మ రెండు పదవులు ఇచ్చారని చెబితే.. మామ గారికి తోడుగా ఉండమని చెప్పాను. పార్టీ నుంచి చంద్రబాబును పంపించి వేస్తే.. మళ్లీ నా దగ్గరుకు వచ్చి అల్లరైపోతాం, పార్టీ గెలవదని నన్ను భయపెట్టాడు. అయితే అప్పుడు నాకు రాజకీయాలు తెలియవు.. నేను భయపడిపోయి ఎన్టీఆర్ కాళ్లమీద పడి అల్లుడు కదా క్షమించండి అని కోరాను. అప్పుడు ఎన్టీఆర్ నా మాట కాదనలేనని చెప్పారు.. అతని నైజం నాకు తెలియదని కూడా అన్నారు. పాముకు పాలు పోస్తున్నావు.. నమ్మించి.. గొంతుకోస్తాడని చంద్రబాబు గురించి ఎన్టీఆర్ చెప్పారు. రేపు అదే జరగబోతుందని.. ఆ రోజే ఎన్టీఆర్ స్పష్టంగా చెప్పారు. ఆ రోజే ఎన్టీఆర్‌కు ఎలాంటి ద్రోహం చేయబోనని చంద్రబాబు దగ్గర మాట తీసుకున్నాను. ఆ రోజు ప్రమాణం చేశావా? లేదా అనేది చంద్రబాబు అతని కొడుకు ప్రమాణం చేసి చెప్పాలి’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. 

ఎన్టీఆర్ కొడుకులు అందరూ అమాయకులేనని లక్ష్మీపార్వతి చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబంలో విషాన్ని నింపింది ఇద్దరేనని అన్నారు. చివరి రోజుల్లో ఆయనను ఎవరైనా వచ్చి పరామర్శించారా? అని ప్రశ్నించారు. పార్టీని కాజేసిన వ్యక్తికి ఎన్టీఆర్ కుమారులు మద్దతు పలికారని విమర్శించారు. ఈ రోజు తండ్రి గురించి మాట్లాడుతున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సిగ్గుపడాలని అన్నారు. ఇప్పటికైనా పశ్చాత్తాప పడరా? అని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios