కర్నూలు: తాను మాజీ కర్ణాటక మంత్రిస మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూతురిని అని, తనను పుట్టగానే నర్సు అపహరించి తీసుకుని వెళ్లిందని అంటూ ఓ కథ అల్లేసిన మాయలేడి పోలీసులకు చిక్కింది. ఆలా చెబుతూ ఆమె గాలి జనార్దన్ రెడ్డి మామ నుంచి డబ్బులు లాగేందుకు ప్రయత్నించింది. ఈ సంఘటనపై గాలి జనార్దన్ రెడ్డి మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దాంతో పోలీసులు ఆమెతో పాటు ఆమెతో వచ్చిన ముగ్గురిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల డిఎస్పీ చిదానంద రెడ్డి ఆ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరారబాదులోని లంగర్ హౌస్ చెందిన గంగ అలియాస్ సంగీతా రెడ్డి, ఆమె భర్త మహమ్మద్ నజీర్, వారి డ్రైవర్ శ్రీమన్నారాయణ మూర్తి, బండి ఆత్మకూరులో ఓ ముఠాగా ఏర్పడ్డారు. 

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం కాకనూరులో ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి మామ దేరెడ్డి పరమేశ్వర్ రెడ్డి ఇంటికి ఆ ముగ్గురు సెప్టెంబర్ 25వ తేదీన వారు వచ్చారు. ఓ కథ అల్లి ఆయనకు చెప్పారు. దాదాపు 28 ఏళ్ల క్రితం గాలి జనార్దన్ రెడ్డి సతీమణి అనంతపురం ఆస్పత్రిలో కవలలకు జన్మ ఇచ్చారని, అందులో ఓ శిశువును నర్సు ఎత్తుకుపోయి  కొన్ని రోజులు పెంచుకుని మరో మహిళకు అప్పగించిందని చెప్పారు. 

ఆ శిశువును తానే అని గంగ చెప్పింది. తాను జనార్దన్ రెడ్డి కూతురిని అని చెప్పడానికి కొన్ని మార్ఫింగ్ ఫొటోలు చూపించింది. "మీ మనవరాలిని అని అంగీకరించండి. లేదా రూ.5 లక్షలు ఇవ్వండి, లేదంటే సోషల్ మీడియాలో ప్రచారం చేసి మీ పరువు మర్యాదలు తీస్తా" అని హెచ్చరించింది.

దాంతో గాలి జనార్దన్ రెడ్డి మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి 5 సెల్ ఫోన్లు, కారు, మార్ఫింగ్ ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.