Asianet News TeluguAsianet News Telugu

జగన్ తో నడవని వైఎస్ ఆత్మ ఏమంటోంది....

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ అంటే తెలియని వారు ఉండరు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పలు వేదికలపై కేవీపీ తన ఆత్మ అంటూ వ్యాఖ్యానించేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాల్య స్నేహితుడిగా చదువుకున్నప్పటి నుంచి చనిపోయే వరకు వైఎస్ ఆయనతోనే ఉండేవారు. వైఎస్ కు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా నిలిచేవారు కేవీపి.

KVP silent on TDP alliance with Congress
Author
Vijayawada, First Published Nov 15, 2018, 3:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ అంటే తెలియని వారు ఉండరు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పలు వేదికలపై కేవీపీ తన ఆత్మ అంటూ వ్యాఖ్యానించేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాల్య స్నేహితుడిగా చదువుకున్నప్పటి నుంచి చనిపోయే వరకు వైఎస్ ఆయనతోనే ఉండేవారు. వైఎస్ కు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా నిలిచేవారు కేవీపి.

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి వరకు షాడోలా ఉన్న కేవీపీ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. వైఎస్ సీఎంగా ఉన్నంతకాలం పాలన అంతా కేవీపీ కనుసన్నుల్లోనే నడిచేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది.  

ప్రతిపక్ష పార్టీలు సైతం కేవీపిని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేసేవి. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు విమర్శలు చేసేవి కూడా. వైఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తన ఆప్తమిత్రుడు ఆత్మ అయిన కేవీపీని కేబినెట్ ర్యాంకు ఉన్న గౌరవసలహాదారుగా నియమించుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభకు కూడా పంపారు. 

వైఎస్ మరణం తర్వాత కూడా కేవీపీ కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నారు. వైఎస్ తనయుడు జగన్ కాంగ్రెస్ పార్టీని విబేధించి సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ కేవీపీ మాత్రం ఎటూ కదల్లేదు. కాంగ్రెస్ ను అంటిపెట్టుకునే ఉన్నారు. 

రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర విభజన సమయంలోనూ ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయంలోనూ రాజ్యసభ లో పోరాటం చేసి ఫోకస్ అయ్యారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఫ్లెక్సీ పట్టుకుని నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి కేవీపీయే అని చెప్పాలి. 

కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత సీఎం చంద్రబాబును కానీ బీజేపీని కానీ విమర్శించే నాయకులు కరువయ్యారు. అప్పుడప్పుడు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఓ మెరుపు మెరిపిస్తే మాటల పొదుపరిగా పేర్గాంచిన కేవీపీ మాత్రం లేఖలతో చంద్రబాబుపై దాడి చేసేవారు. 

జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో వైఎస్ ఆర్ తో కలిసి పోరాటం చేశారు. రాజమండ్రి నుంచి పోలవరం వరకూ పాదయాత్ర కూడా చేశారు. తన ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉంది అంటే అది కేవీపీలాంటి వాళ్ల వల్లే అనుకోవాలి. 

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైనా, ప్రాణస్నేహితుడు తనయుడు జగన్ సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినా కేవీపీ మాత్రం కాంగ్రెస్ ను వీడిపోలేదు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగానే కొనసాగుతూ వచ్చారు. అలాంటి కేవీపి పరిస్థితి ఇప్పుడు సంకటంలో పడింది. 

తన ఆప్తమిత్రుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి తెలుగుదేశంపై అలుపెరగని పోరాటం చేశారు. చివరికి కోర్టుల్లో కూడా ఇరుక్కున్నారు. అటు బీజేపీతోనూ ఢీ అంటే ఢీ అనేవారు. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడిపై లేఖల దాడి చేస్తున్నారు.  

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలవడం కలిసి పని చేస్తామని ప్రకటించడం కూడా జరిగిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేవీపీ భవిష్యత్ డోలయమానంలో పడింది. 

ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కొందరు కేవీపీని తమ బాస్ గా భావిస్తుంటారు. ఆర్థికంగా, రాజకీయంగా తమకు అండగా ఉంటారని కేవీపీతో తరచూ సమావేశమవుతుంటారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఇక్కడ నేతలకు కేవీపీ దూరమైపోయారు. 

తెలంగాణలోనే అనుకుంటే ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయిన కేవీపీ ఇప్పుడు ఏపీలో పొత్తు పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు. ఇటీవలే రాహుల్ గాంధీ దూతగా అశోక్ గెహ్లాట్ విజయవాడ వచ్చినా కనుచూపు మేరల్లో కేవీపీ ఎక్కడా కనిపించలేదు.  

కేవీపీ కనిపించకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి టీడీపీతో జత కట్టడం కేవీపీకి అస్సలు ఇష్టం లేదు. కానీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడంతో ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. వైఎస్ఆర్ ని ద్వేషించే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ లోనే కేవీపీ కొనసాగుతారా? లేక బయటకు వచ్చి జగన్ పార్టీలో చేరతారా అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

కేవీపీపై అప్పట్లో టీడీపీ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసింది. ఆయన తనయుడు పవర్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారంటూ విమర్శలు చేసింది. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. కేవీపీ టైటానియం కుంభకోణానికి పాల్పడ్డారని ప్రచారం జరిగింది. 

టైటానియం ఖనిజాలను డాన్ ఫిర్టాష్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో అమ్మ‌కాలు జ‌రిపి ఆ త‌రువాత ఆ న‌గ‌దునే, అమెరికాలో కేవీపీ స్థాపించిన డొల్ల కంపెనీల‌కు బ‌దిలీ చేయించారంటూ కేసులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో కేవీపీని అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిందన్న ప్రచారం కూడా  జరిగింది.  

ఈ నేపథ్యంలో కేవీపీ పార్టీ మారితే టీడీపీ, కాంగ్రెస్ కలిపి వాటిని తిరగదోడే ప్రమాదం లేకపోలేదని కేవీపీ వద్ద సన్నిహితులు వాపోతున్నారట. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలోకి జంప్ అయి ఇరుక్కునే కన్నా సైలెంట్ గా ఉండి జగన్ కు సహకరిస్తే సరిపోద్దని కొందరు సూచిస్తున్నారట. అయితే కేవీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఒపికపట్టాల్సిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీతో పొత్తు: తేల్చేసిన ఏపీకాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios