రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వారందరూ టిడిపికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే తాను టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

‘అభివృద్ధి కోసమే టిడిపిలో చేరుతున్నాను’..ఇది తాజాగా కర్నూలు వైసీపీ ఎంపి బుట్టా రేణుక టిడిపిలోకి ఫిరాయించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. మంగళవారం ఉదయం సిఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు. అనంతరం బుట్టా మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వారందరూ టిడిపికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే తాను టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉందని బుట్టా చెప్పారు.

అంతుకుముందు చంద్రబాబు మాట్లాడుతూ, అభివృద్ధి అజెండాతో టిడిపిలో ఎంపి బుట్టా రేణుక చేరటం చాలా సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధికి సహకరించేవారు ఎవరైనా టిడిపిలో చేరవచ్చని చంద్రబాబు చెప్పారు. బుట్టా చేరిక సందర్భంగా కర్నూలు జిల్లాకే చెందిన మంత్రి భూమా అఖిలప్రియ, ఇన్చార్జి మంత్రి కాలువ శ్రీనివాసులు, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రాయనారాయణ తదిరతులు హాజరయ్యారు.