కర్నూలు: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఓవర్ టేక్ చేయబోయిన ప్రవేట్ బస్సు అదుపుతప్పి ఆ లారీనే ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా పదిమందికి తీవ్ర గాయాలపాలయ్యాయి. 

వివరాల్లోకి వెళ్తే  ఎస్ఆర్ ఎస్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. మార్గమధ్యలో కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర లారీని ఓవర్‌టేక్ చేయబోయిన ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో లారీలోని ఇనుప పైపులు బస్సులోకి దూసుకెళ్లాయి. దీంతో సీట్లలోనే ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ప్రమాదంలో గాయపడ్డ పదిమందిని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.