కర్నూల్: మాజీ మేయర్, టీడీపీ నేత బంగి అనంతయ్య సోమవారం నాడు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పార్టీ కండువా వేసి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. 1995 నుండి 2000 వరకు ఆయన కర్నూల్ మేయర్ గా పనిచేశారు. 

అనంతయ్యతో పాటు టీడీపీ నేతలు లక్ష్మయ్య , సురేష్, రవిశంకర్, రఘు, రాణా ప్రతాప్, శంకర్, చిరంజీవిలు కూడ వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. కార్పోరేషన్ ఎన్నికలు జరిగే సమయంలో బంగి అనంతయ్య టీడీపీని వీడారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి తాను వైసీపీలో చేరినట్టుగా ఆయన మీడియాకు చెప్పారు. రాష్ట్రాభివృద్ది జగన్ తోనే సాధ్యమన్నారు. 

2020 మార్చి మాసంలో చంద్రబాబు తీరుపై అసంతృప్తి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడ ఆయన టీడీపీని వీడారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలో కొనసాగారు.

టీడీపీలో ఉన్న సమయంలో వినూత్న నిరసనలతో ఆయన నిత్యం వార్తల్లో నిలిచేవారు. టీడీపీ విపక్షంలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన  వెరైటీగా నిరసనలకు దిగేవారు.