కర్నూలు: 2014లో కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన దాడి ఘటనపై కర్నూలు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. మున్సిపాలిటీలో దాడి ఘటనకు సంబంధించి దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 

భూమా నాగిరెడ్డి అనుచరులైన 13 మందికి రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ఇకపోతే నవంబర్ 1 2014న నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఘర్షణలో పలువురు గాయపడ్డారు.  

ఈ దాడులలో తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డిపైనా, ఆయన అనుచరులపైనా కేసులు నమోదు అయ్యాయి. 

భూమా నాగిరెడ్డిపై రెండు హత్యాయత్నం కేసులతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా ఆయన అనుచరులుపై కూడా హత్యాయత్నం, దాడి కేసులు నమోదు అయ్యాయి. ఆనాడు భూమా నాగిరెడ్డి అజ్ఞాతంలోకి కూడా వెళ్లారు. తన గన్ మెన్లను సైతం వదిలేసి అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

 అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జరిగిపోయాయి. ఇకపోతే ఆయన కుమార్తె భూమా అఖిలప్రియ తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారు. 

భూమా నాగిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నమోదైన కేసులో ఇప్పుడు తీర్పు వెలువడటం చర్చనీయాంశంగా మారింది. అయితే శిక్ష పడ్డ వారంతా ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్న నేపథ్యంలో తీర్పుపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.