పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు.. ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదన్న ఎస్పీ జాషువా..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడనలో జనసేన వారాహి సభలో అల్లర్లకు కుట్ర జరుగుతుందని పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పవన్ కల్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలకు ఉన్నాయా తెలుసుకునేందుకు నోటీసులు ఇచ్చినట్టుగా కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. పెడనలో జనసేన సభలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పవన్ డైరెక్ట్‌గా కొన్ని ఆరోపణలు చేయడం జరిగిందని అన్నారు. ఆరోపణలు చేయడమే కాకుండా.. పార్టీ శ్రేణులకు కూడా వాళ్లను బంధించాలని సందేశం ఇవ్వడం జరిగిందని చెప్పారు.
వీటిని తాము నిశితంగా పరిశీలించామని ఎస్పీ జాషువా చెప్పారు. వారి పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అయితే పవన్ నిన్న చేసిన ఆరోపణలకు ఎదైనా క్రెడిబుల్ సమాచారం ఉందనే దానిపై నోటీసులు ఇచ్చామని చెప్పారు. మచిలీపట్నం డీఎస్పీ, పెడన సీఐలు.. పవన్ కల్యాణ్‌కు నోటీసు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆ ఆరోపణలు చేసేందుకు పవన్‌కు ఉన్న ఆధారాలను పోలీసులకు తెలియజేయాలని నోటీసులు కోరారు. పవన్ చెప్పినట్టుగా ఏదైనా రౌడీ ఎలిమెంట్స్, అసాంఘిక శక్తులు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎటువంటి సమాచారంతో, బేస్ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారనేది తెలియాల్సి ఉందని ఎస్పీ జాషువా అన్నారు. తాము ఇచ్చిన నోటీసుకు పవన్ నుంచి రిప్లై రాలేదని తెలిపారు. పవన్ ఆయన వద్ద ఉన్న సమాచారం షేర్ చేస్తే.. శాంతియుతంగా వారి కార్యక్రమం జరిగేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల శాంతియుత జీవనానికి ఇబ్బంది కలగకూడదనేదే తమ ప్రధాన ఉద్దేశం అని అన్నారు. అయితే రిప్లై లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మేము అనుకోవాలా? అని ప్రశ్నించారు. ఏ రాజకీయ పక్షమైన వ్యాఖ్యలు ,ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా ఉండాలని.. సరైన ఆధారం లేకుండా చేయకూడదని అన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే పర్యవసనాలు ఉంటాయని అన్నారు. తమ సమాచార వ్యవస్థ తమకుందని చెప్పారు.
ఇక, జనసేన వారాహి విజయ యాత్రను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పవన్ కల్యాణ్ మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. వారాహి యాత్రపై రాళ్ల దాడి కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో బుధవారం జరిగే వారాహి యాత్రను అడ్డుకునేందుకు కొంతమంది గూండాలను, క్రిమినల్స్‌ను పబ్లిక్ మీటింగ్‌లో దించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తనవద్ద సమాచారం ఉందన్నారు. పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు.