ఆంధ్రప్రదేశ్ లో భారీగా కురుస్తున్న వర్షాలు కృష్ణానది పరివాహక ప్రాంతాలను అతలాకుతలం చేస్తుంది. కృష్ణా జిల్లా, అవనిగడ్డలోని భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్ కు చెందిన ఇల్లు కృష్ణానది వరదనీటిలో కొట్టుకుపోయింది. 

హీరో శర్వానంద్ కు హరిప్రసాద్ తాతయ్య అవుతారు. గతంలో అవనిగడ్డకు వచ్చినప్పుడల్లా ఈ ఇంట్లోనే గడిపేవాడు. ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. అణుశాస్త్రవేత్తగా, సంఘసేవకుడిగా మైనేని హరిప్రసాద్ బాగా పేరున్న వ్యక్తి. ఆయన మనవడిగా, తనదైన విలక్షణ నటనతో హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి శర్వానంద్. వీరికి చెందిన ఇల్లు కావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

గత ఏడాది కృష్ణానదికి వచ్చిన వరదల్లో శర్వానంద్ ముత్తాతకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా నదిలో కొట్టుకుపోయింది. ఈ సారి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 

ఎగువ నుంచి కృష్ణానదికి నాలుగైదు రోజులుగా భారీగా వస్తున్న వరదలకు నదీపరివాహక ప్రాంతాల్లో చాలా పొలాలు ముంపు బారినపడ్డాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన కాలువలు నిండుగా ప్రవహిస్తుండడంతో కృష్ణా,గుంటూరు, కర్నూలు జిల్లాల్లో వాటి పరిధిలోని ఆయకట్టులోని వరి చేలు మునుగుతున్నాయి.