ఏపీలో అధ్వాన్నంగా రోడ్లు.. గుంతకు బలైన మహిళా వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్‌లో అధ్వాన్నంగా వున్న రోడ్ల కారణంగా ఓ మహిళా నాయకురాలు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపీపీ ప్రసన్న లక్ష్మీ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు మధ్య వున్న గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్ధితి (roads condition in ap) దారుణంగా వున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన (janasena) పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ సైతం నిర్వహించింది. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వెల్లువెత్తాయి. తాజాగా రోడ్లపై గుంత కారణంగా వైసీపీకి చెందిన మహిళా ఎంపీపీ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా (krishna district) తేలప్రోలు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రసన్నలక్ష్మి అనంతరం ఉంగుటూరు (unguturu mpp) మండలాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఎంపీడీవో కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో ప్రసన్నలక్ష్మీ పాల్గొన్నారు. సాయంత్రం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భర్తతో కలిసి బైక్‌పై తేలప్రోలు- ఆనందపురం మార్గంలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బైక్ రహదారి మధ్యలో ఉన్న గుంతలో పడటంతో ఎంపీపీకి తీవ్రగాయాలయ్యాయి. ఆమె భర్త స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరినీ విజయవాడలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసన్నలక్ష్మి బుధవారం ఉదయం చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు , వైసీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు పార్టీ నేతలు ప్రసన్న లక్ష్మీ మరణంపై సంతాపం ప్రకటించారు.