Asianet News TeluguAsianet News Telugu

గుడివాడలో క్యాసినో: విచారణకు జిల్లా ఎస్పీ కౌశల్ ఆదేశం

కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో పై విచారణకు జిల్లా ఎస్పీ  సిద్దార్ధ కౌశల్ ఆదేశించారు. ఈ విషయమై టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై  నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు విచారణ నిర్వహించనున్నారు.

Krishna District SP Siddharth kaushal appoints probe officer in Gudivada Casino case
Author
Vijayawada, First Published Jan 19, 2022, 10:20 AM IST

విజయవాడ కృష్ణా జిల్లా Gudivada లో సంక్రాంతిని పురస్కరించుకొని నిర్వహించిన క్యాసినో పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ సిద్దార్ద కౌశల్ ఆదేశించారు.

గుడివాడలో క్యాసినో పై Tdpనేతలు కృష్ణా జిల్లా ఎస్పీ Siddharth kaushalకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపించాలని ఎస్పీ నిర్ణయం తీసుకొన్నారు. Nuzvid dsp డీఎస్పీ Srinivasuluను విచారణాధికారిగా నియమించారు ఎస్పీ కౌశల్.

గుడివాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో  కోడి పందెలు, పేకాట శిబిరాలు, గుండాటతో పాటు ప్రత్యేకంగా క్యాసినో నిర్వహించారు. రూ. 10 వేలు చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతించారు నిర్వాహకులు. ఈ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో ప్రత్యేకంగా బౌన్సర్లను కూడా నియమించారు. 

ఈ ఫంక్షన్ హాల్లో  విచ్చలవిడిగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తో పాటు చట్ట విరుద్దమైన కార్యక్రమాలు నిర్వహించారని  టీడీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఈ నెల 17న ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 500 కోట్లు చేతులు మారాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై  పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.

Casino నిర్వహించిన ఫంక్షన్ హాల్ రాష్ట్ర మంత్రికి చెందిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఈ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో అమ్మాయిలతో నృత్యాలు కూడా నిర్వహించారని టీడీపీ నేతలు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గోవా తరహలోనే  ఈ క్యాసినో సెంటర్ ను నిర్వహించారని టీడీపీ ఆ ఫిర్యాదులో పేర్కొంది.ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ ఫంక్షన్ హాల్లో  సాగుతున్న తతంగాన్ని ప్రసారం చేశాయి.

ఈ నెల 14 నుండి మూడు రోజుల పాటు ఈ ఫంక్షన్ హాల్లో క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై కొందరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు విజయవాడ ఎంపీ కేశినేని నాని నేతృత్వంలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

మరో వైపు ఈ విషయమై ఓ సామాజిక కార్యకర్త  వైవీ మురళీకృష్ణ  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖలు రాశారు.  గోవా తర్వాత గుడివాడ క్యాసినో సెంటర్ గా పేరొందిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేయని విషయాన్ని కూడా ఆ లేఖలో ఆయన గుర్తు చేశారు. కోట్లాది రూపాయాలను ఈ క్యాసినో సెంటర్ కారణంగా స్థానికులు కోల్పోయారని ఆయన ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.

ఈ ఫంక్షన్ లో హల్ లో సాగిన క్యాసినో సెంటర్ విషయమై సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.  ఈ వీడియోలను కూడా విచారణ అధికారి పరిశీలించనున్నారు.అయితే ఈ క్యాసినో సెంటర్ నిర్వహణ వెనుక రాజకీయ నేతల అండ ఉందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ కారణంగానే కనీసం కేసులు కూడా నమోదు కాలేదని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయమై నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు విచారణ నిర్వహించి సమగ్రంగా నివేదిక  ఇవ్వాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios