కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగలనునంది. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపై గత కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇక కాంగ్రెస్‌ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకుంటుందని కోట్ల భావించారు. 

అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని బుధవారం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ స్పష్టం చెయ్యడంతో కోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందన్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోట్ల ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. 

కొద్ది రోజుల క్రితమే కోట్ల కాంగ్రెస్ పార్టీని వీడతారంటూ ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికలు రావడం, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే కర్నూలు ఎంపీగా పోటీచేసి గెలుపొందవచ్చునని ఆయన భావించారు. 

అయితే ఏపీలో పొత్తు లేదని స్పష్టంకావడంతో ఆయన ఇక సైకిలెక్కేందుకు రెడీ అయ్యారు. బుధవారం జరిగిన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పినప్పుడే అసహనం వ్యక్తం చేసిన కోట్ల సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. 

2014లో రాష్ట్ర విభజన వల్ల పార్టీ ఘోరంగా దెబ్బతిందని నాలుగున్నరేళ్లల్లో చేసిన వివిధ కార్యక్రమాల వల్ల ప్రజాభిమానం మెరుగుపడిందని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇవ్వడం, సీడబ్ల్యూసీలో తీర్మానం చెయ్యడం వంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. 

టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కొద్ది స్థానాల్లో అయినా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని లేకపోతే పార్టీ మునిగిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. అవేమీ పట్టించుకోకుండా పొత్తు ఉండదని తెగేసి చెప్పడంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. 

శుక్రవారం తన అనుచరులతో కలిసి ఏపార్టీలో చేరాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, అతని భార్య మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

 అయితే ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని అలాగే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీవైపే మెుగ్గు చూపుతున్నారని తెలిసింది. శుక్రవారం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు.