కోట్ల బ్రదర్స్‌ రాజకీయంగా చీలిపోయారు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్‌లో ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు హర్షవర్థన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సూర్యప్రకాశ్ టీడీపీలో చేరుతుండగా.. ఆయన బాటలోనే సోదరుడు కూడా నడుస్తారని ప్రచారం జరిగింది.

అయితే ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్‌ను వీడేందుకు నిర్ణయించిన హర్షవర్థన్ కోడుమూరులో అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వైసీపీ వైపే మెజారిటీ వ్యక్తులు జై కొట్టడంతో ఆయన జగన్ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకోవాలనుకున్నారు.

తన సోదరుడు సూర్యప్రకాశ్ రెడ్డి వ్యవహారం తనను నోప్పించిందని , అందువల్లే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు హర్షవర్థన్ రెడ్డి మీడియాతో తెలిపాడు. గురువారం వైసీపీ అధినేత జగన్ కడపలో తలపెట్టిన శంఖారావంలో పాల్గొనేందుకు కర్నూలు నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.

ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. కాగా, ఇంతకాలం ఒకే పార్టీలో ఉన్నఅన్నదమ్ములు ఇప్పుడు రాజకీయంగా బద్ధ శత్రువులైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేయనున్నారు. దీంతో కోట్ల కుటుంబంలో ఎలాంటి అలజడి రేగుతుందోనని కర్నూలులో చర్చ నడుస్తోంది.