ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తమ రాజకీయ ప్రయోజనాలు, భవిష్యత్ కోసం చాలామంది నాయకులు కండువాలు మార్చుకోడాని సిద్దమయ్యారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు, కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి వైఎస్సార్‌సిపి కండువా కప్పుకున్నారు. 

ఇవాళ వైఎస్సార్‌సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో హర్షవర్ధన్ రెడ్డి  పార్టీలో చేరారు. ఆయనతో పాటు కొడమలూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు వైఎస్సార్‌సిపి తీర్థం పుచ్చుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన 2వేల మంది కార్యకర్తలు కూడా తమ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి వెంటే నడిచారు.  

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా తమ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీల్లో చేరారు. ఇలాంటి గడ్డు కాలంలో కూడా కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల సోదరులు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడలేదు. అయితే ఐదేళ్లు గడిచినా ఏపిలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఇక లాభం లేదని భావించిన కోట్ల సోదరులు పార్టీ మారడానికి సిద్దమయ్యారు. 

అయితే అన్నదమ్ములిద్దరు ఒకే పార్టీలోకి కాకుండా వేరు వేరు పార్టీల్లో చేరుతూ రాజకీయంగా చీలిపోయారు. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ  వైపు మొగ్గుచూపగా...  ఆయన సోదరుడు హర్షవర్ధన్ మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఇంతకాలం ఒకే పార్టీలో ఉన్నఅన్నదమ్ములు ఇప్పుడు రాజకీయంగా బద్ధ శత్రువులైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేయనున్నారు. దీంతో కోట్ల కుటుంబంలో ఎలాంటి అలజడి రేగుతుందోనని కర్నూలులో చర్చ నడుస్తోంది.