అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బుచ్చయ్య చౌదరికి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య శాసనసభ ఆవరణలో ఆసక్తికరమైన చర్చ జరిగింది.  బుచ్చన్నా.. బాగున్నావా.. అంటూ  కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుధవారం పలకరించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డికి బుచ్చయ్య చౌదరి శుభాకాంక్షలు తెలిపారు.

"అన్నా.. ఐదేళ్లు మీరు అధికారంలో ఉన్నారు... ఇప్పుడు మేం వచ్చాం. అధికార పక్ష ఎమ్మెల్యేలుగా మేమెలా వ్యవహరించాలో చెప్పన్నా.." అని కోటంరెడ్డి అడిగారు. దీనికి బుచ్చయ్యచౌదరి చిరునవ్వు నవ్వారు. 

దాంతో కోటంరెడ్డి ఆగకుండా - "అన్నా.. అసెంబ్లీలో రికార్డు పుస్తకాలు తెప్పించాను. గతంలో ప్రతిపక్షాన్ని మీరెన్ని తిట్లు తిట్టారో చూస్తాను. వాటికి మరింత క్రీమ్‌ రాసి ఈ ఐదేళ్లూ మీపై సంధిస్తాం" అని సరదాగా అన్నారు. బుచ్చయ్యచౌదరి నవ్వుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.